అటవీ సిబ్బందికి సాయుధ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో అటవీ శాఖ అధికారులపై ఎర్రచందనం స్మగ్లర్లు ఇటీవల జరిపిన దాడుల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. స్మగ్లర్లు సహా ఇతర అరాచక శక్తులను సమర్థంగా తిప్పికొట్టేలా అటవీ సిబ్బందికి పోలీసు శిక్షణ సంస్థల్లో సాయుధ శిక్షణ ఇవ్వనుంది. తొలుత ఎర్రచందనం వృక్షాలు ఎక్కువగా ఉన్న శేషాచలం అడవుల్లో విధులు నిర్వర్తించే చిత్తూరు, వైఎస్సార్ జిల్లాకు చెందిన 280 మంది అధికారులకు ఇటీవలే శిక్షణ ప్రారంభించారు.
శిక్షణలో భాగంగా వీరికి 303 రైఫిల్ వినియోగంలో మెళకువలు నేర్పిస్తారు. 15 రోజుల శిక్షణ అనంతరం వారికి ఆయుధాలు అందిస్తారు. స్మగ్లర్ల వేటకు వెళ్లే అటవీ సిబ్బందికి భద్రతగా ఏపీఎస్పీ బలగాలను పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిబ్బందికి ఇచ్చేందుకు అటవీ శాఖ ఇప్పటికే 303 రైఫిళ్లు సహా సింగిల్బోర్ బ్రీచ్లోడింగ్ తుపాకులను కొనుగోలు చేసింది.