‘బలవంతంగా ఎత్తుకుపోయారు’
ఆర్మూర్: మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని తనను ఆ పార్టీ నాయకులు బలవంతంగా కిడ్నాప్ చేశారని నిజామాబాద్ జిల్లా ఆరూర్ కౌన్సిలర్ సుంకరి శంకర్ తెలిపారు. ఆర్మూర్ డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం టీఆర్ఎస్ క్యాంపులో కొనసాగిన తాను ఇంటికి వచ్చానన్నారు.
శనివారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా... కాంగ్రెస్ నాయకులు వందన లక్ష్మీనారాయణ, బట్టు శంకర్, గ్యాస్ ప్రభాకర్ వచ్చి చైర్పర్సన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని ఒత్తిడి చేసారన్నారు. తాము పార్టీకి ద్రోహం చేయలేమని చెప్పినా.. వినకుండా బలవంతంగా కారులో హైదరాబాద్ మీదుగా వైజాగ్‌కు తరలించారన్నారు. శంకర్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆర్మూర్ పోలీసులు విచారణ ప్రారంభించారు. చివరకు శంకర్ వైజాగ్‌లో ఉన్నట్లు కనుగొని ఆర్మూరుకు తీసుకు వచ్చారు. కిడ్నాప్‌కు పాల్పడిన బట్టు శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.