7న రోటరీ ‘మైఫ్లాగ్ మై ఇండియా’
ఆర్మీఫ్లాగ్ డే సందర్భంగా ఈనెల 7న రోటరీ ‘మైఫ్లాగ్ మై ఇండియా’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రోటరీ క్లబ్ గవర్నర్ (3230) నాజర్ చెప్పారు. చెన్నై నందనంలోని వైఎంసీఏ మైదానంలో 50 వేల మంది జాతీయ పతాకం ఆకారంలో నిలబడతారని మంగళవారం మీడియా సమావేశంలో ఆయన తెలిపారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:
భారతదేశ ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 68 ఏళ్లు గడవగా గతంలో ఎవ్వరూ పూనుకోని విధంగా నిర్వహించి గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. పాకిస్థాన్, నేపాల్ దేశాలు ఇదే ప్రయత్నం చేశాయని, భారత జాతీయ పతాకానికి సైతం గిన్నిస్‌బుక్‌లో చోటుదక్కించడం కోసం రోటరీ శ్రమిస్తోందన్నారు. జాతీయ పతాక గౌరవాన్ని ఇనుమడింప జేసేందుకు విద్యా, వైద్య, కళారంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే 56 వేల మంది ఆన్లైన్ ద్వారా రిజిష్టరు చేసుకున్నారని తెలిపారు. గిన్నిస్‌బుక్ రికార్డు ప్రతినిధులు లండన్ నుంచి ఆరోజు ప్రత్యేకంగా హాజరై అప్పటికప్పుడే రికార్డును ప్రకటిస్తారని నాజర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు 7 వ తేదీ ఉదయం 6గంటలకు మైదానం చేరుకుని రూ.300 చెల్లించి పేర్లను రిజిస్టరు చేసుకోవచ్చని తెలిపారు.
మహాత్ముని మరిచే రోజులు: నటుడు శరత్‌కుమార్
నేటి తరం స్వాతంత్య్రం సాధించి పెట్టిన వీరుల పేర్లనే మరిచిపోయే రోజులు దాపురించాయని దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం అధ్యక్షుడు, నటులు శరత్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ, సుభాష్ చంద్ర బోస్, బాలగంగాధర్ తిలక్, వల్లభాయి పటేల్ వంటి దేశభక్తుల పేర్లను నేటి తరం మరిచిపోయారన్నారు. ఇటువంటి తరుణంలో ఆ మహనీయులను గుర్తుకు తెస్తూ మైఫ్లాగ్ మై ఇండియా వంటి కార్యక్రమాన్ని చేపట్టడం హర్షణీయమన్నారు. దేశభక్తిని చాటుకునే ఈ మహత్తర కార్యక్రమానికి నటీనటులు కూడా హాజరుకానున్నారని తెలిపారు.