అంకిత్ కేసరీని వెంటాడిన దురదృష్టం
కోల్ కతా: దురదృష్టం వెంటాడితే ఎవరూ తప్పించుకోలేరు. బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ కేసరీ(20)ని దురదృష్టం వెంటాడింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ యువ ఆటగాడు అర్ధాంతరంగా తనువు చాలించాడు. అసలు ఆటలోనే లేనప్పటికీ విధి ఆడిన మృత్యుక్రీడలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
గత శుక్రవారం ఈస్ట్ బెంగాల్ - భావన్ పురీ జట్ల మధ్య జరిగిన స్థానిక మ్యాచ్ లో క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించిన కేసరీ మైదానంలో వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి మరో క్రికెటర్‌ను ఢీకొట్టాడు. తలకు బలమైన గాయంతో నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసిన కేసరీ సోమవారం తుదిశ్వాస విడిచాడు. మ్యాచ్ జరిగిన రోజున ఈస్ట్ బెంగాల్ జట్టులో అతడు 12వ ఆటగాడు మాత్రమే.
ఫీల్డింగ్ చేస్తున్న ఆర్నాబ్ నంది అనే ఆటగాడు బ్రేక్ తీసుకోవడంతో అతడి స్థానంలో మైదానంలోకి వచ్చిన కేసరీ క్యాచ్ పట్టబోయి కుప్పకూలిపోయాడు. మరికొన్ని ఓవర్లు మాత్రమే మిగిలివుండగా ఈ ఘటన చోటుచేసుకుందని బెంగాల్ క్రికెట్ సంఘం అధికారి ఒకరు వెల్లడించారు. కనీసం 11వ ఆటగాడిగా కూడా లేని కేసరీ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఓపెనర్ గా బ్యాటింగ్ చేసే కేసరీ గతంలో బెంగాల్-19 టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించాడు.