చంద్రన్న కానుకల పంపిణీపై విజిలెన్స్ తనిఖీలు
కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రన్న సంక్రాంతి ఉచిత సరుకుల పంపిణీ సక్రమంగా జరగడం లేదని ఫిర్యాదులు అందడంతో సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్ఈఓ చంద్రశేఖర్‌రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు నగరంలో తనిఖీలు నిర్వహించారు. కర్నూలు నగరంలో 161 చౌక డిపోలు ఉన్నాయి. 99,241 కార్డుదారులు ఉన్నారు. వారందరికీ చంద్రన్న సంక్రాంతి ఉచిత రేషన్ కిట్‌ను అందించాల్సి ఉంది.
పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత ఆదివారం కర్నూలులో లాంఛనంగా ఉచిత సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు(మధ్యాహ్న భోజన సమయంలో గంట సేపు) మినహా రెండు రోజుల పాటు నిరంతరాయంగా సరుకులు పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించినా క్షేత్రస్థాయిలో అమలు జరగలేదు.
మొదటి రోజు మధ్యాహ్నం వరకు రెండవ రోజు గంటసేపు సరుకులు పంపిణీ చేసి పలువురు డీలర్లు దుకాణాలు మూసివేశారు. దీంతో పౌర సరఫరాల శాఖ అధికారులతో పాటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తహశీల్దార్లు రామక్రిష్ణారావు, సీఐ వై.శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం కర్నూలు నగరంలో పర్యటించి సరుకుల పంపిణీ తీరును పరిశీలించారు.
125వ దుకాణం తెరవకపోవడంతో ఫోన్‌చేసి రప్పించి లబ్ధిదారులకు సరుకులను పంపిణీ చేయించారు. 125వ దుకాణంతో పాటు 144వ చౌక దుకాణం కూడా ఇన్చార్జిగా నియమించడంతో రెండు చోట్ల అరకొర పంపిణీ చేసినట్లు లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. 30, 38 చౌక డిపోలు సోమవారం అసలు తెరవలేదు. 120వ చౌక డిపో డీలరు, గంటసేపు సరుకులు పంపిణీ చేసి దుకాణం కట్టేసి వెళ్లిపోయారు.