ఫాలోఆన్‌లో శ్రీలంక
⇒ రెండో ఇన్నింగ్స్ 84/0
⇒ కివీస్ తొలి ఇన్నింగ్స్ 441
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ జట్టు ఆల్‌రౌండ్ షో ముందు శ్రీలంక జట్టు ఉక్కిరిబిక్కిరవుతోంది. తొలి రోజు ఆటలో మెకల్లమ్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టగా... రెండో రోజు బౌలర్లు రెచ్చిపోయారు. ఫలితంగా శనివారం లంక జట్టు రెండుసార్లు బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. ముందుగా తమ తొలి ఇన్నింగ్స్‌లో 42.4 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. దీంతో కివీస్‌కు 303 పరుగుల భారీ ఆధిక్యం అందింది.
పేసర్లు ట్రెంట్ బౌల్ట్ (3/25), నీల్ వాగ్నర్ (3/60) ధాటికి శ్రీలంక కుప్పకూలింది. సౌతీ, నీషమ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (85 బంతుల్లో 50; 3 ఫోర్లు; 2 సిక్సర్లు) మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఆ తర్వాత ఫాలోఆన్ కోసం బరిలోకి దిగిన లంక రెండో రోజు ముగిసే సమయానికి 35 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసింది. అంతకుముందు 429/7 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ఆట ప్రారంభించిన కివీస్ 85.5 ఓవర్లలో 441 పరుగులకు ఆలౌటయ్యింది.