నేడు దుర్గమ్మకు గాజుల అలంకరణ
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ మంగళవారం గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. దుర్గమ్మ అంతరాలయంతో పాటు ఆలయ ప్రాంగణం, మహామండపంలోని ఆరో అంతస్తును గాజులతో ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 80వేల నుంచి లక్షమంది భక్తులు దర్శనానికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఘాట్రోడ్డులోని పొంగలి షెడ్డు నుంచి ఉచిత దర్శనంతో పాటు రూ.300 టికెట్కు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. దర్శనానంతరం భక్తులు నేరుగా మహామండపంలోని ఆరో అంతస్తుకు చేరుకునేలా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు.
మహామండపం దిగువన ధనలక్ష్మీ యాగం
ధన త్రయోదశిని పురస్కరించుకుని దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ధనలక్ష్మీ యాగానికి అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఈవో సూర్యకుమారి ఆదేశాలు జారీ చేశారు. దసరా ఉత్సవాల్లో సాంస్కృతిక వేదికను ఏర్పాటుచేసిన మహామండపం సమీపంలోని ఖాళీ స్థలంలో యాగశాలను నిర్మిస్తున్నారు. యాగశాలతో పాటు అర్చకులు, వేద పండితులు, ఉభయదాతలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆలయ ఇంజినీరింగ్ విభాగానికి ఈవో ఆదేశాలు జారీచేశారు.