arrears Paid
-
Gun Culture: పంజాబ్‌లో ముఠా సంస్కృతి.. ఇదో రకం రక్తచరిత్ర
అదో గ్రామీణ పంజాబ్ రోడ్డు. తెల్ల కారు, దాని వెనకాల నల్లజీపు. అంతలో హఠాత్తుగా తూటాల శబ్దాలు. ఎర్రగా పరుచుకున్న రక్తపు మడుగు. పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు సిద్ధూ మూసేవాలా తాలూకు ఓ మ్యూజిక్ వీడియోలోని దృశ్యాలివి. ఆయన హత్య జరిగిన తీరు కూడా అచ్చం ఆ వీడియోను తలపించేలా ఉండటం అందరినీ విస్మయపరుస్తోంది. పంజాబ్‌లో గాయకులది, గ్యాంగ్స్టర్లది అవినాభావ బంధం. కొందరు సింగర్ల పాటలకు గ్యాంగ్ కల్చరే థీమ్‌గా ఉంటుంది. ఇంకొందరు గాయకులు తమ బకాయిల వసూలుకు గ్యాంగ్స్టర్లను నియమించుకుంటారు. మరోవైపు గ్యాంగస్టర్స్ డబ్బులు దండుకోవడానికి గాయకులను బెదిరిస్తూ ఉంటారు. మొత్తమ్మీద ఇదో రకం రక్తచరిత్ర... సిద్ధూ మూసేవాలా. ‘సో హై’ వీడియో ద్వారా 2017లో పంజాబీ పాప్ ప్రపంచంలో అడుగు పెట్టారు. చూస్తుండగానే అందనత్త ఎత్తుకు ఎదిగారు. ఆయన పాడిన పాటలన్నీ గ్యాంగస్టర్ థీమ్‌తో ఉన్నవే. రెండు చేతులకూ వజ్రాల వాచీలు, చేతిలో ఏకే 47 గన్, దాన్ని పేల్చడానికి శిక్షణ తీసుకోవడం, కారులోంచి నోట్లు వెదజల్లడం వంటి సీన్లతో సిద్ధూ పాటలు యూత్‌ను ఊపేశాయి. ఆయన హత్యకు నెల రోజుల ముందే ముఠా నేరాలకు తెర దించేందుకు యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్‌ను సీఎం భగవంత్ మాన్ ఏర్పాటు చేశారు. గ్యాంగస్టర్లే యూత్ ఐకాన్లు విలాస జీవితానికి అలవాటు పడ్డ గ్యాంగ్‌స్టర్స్‌కు పంజాబీ యువతలో ఫాలోయింగ్ ఎక్కువ. ఈ గ్యాంగ్స్టర్స్ సోషల్ మీడియాలో పెట్టే తమ ఖరీదైన కార్లు, బైకులు, రైఫిళ్ల పోస్టులకు లెక్కలేనన్ని లైకులొస్తుంటాయి. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి గ్యాంగ్స్టర్లుగా మారిన వారు ఒక్కసారిగా వచ్చిపడుతున్న భారీ డబ్బును ఆడంబరంగా ప్రదర్శించడం రివాజుగా మారింది. అదే యూత్‌ను బాగా ఆకర్షిస్తూ పంజాబ్‌లో గన్ కల్చర్‌ను పెంచుతోంది. నిరుద్యోగం, ఈజీ మనీకి అలవాటు పడడం, హై–ఫ్లై లైఫ్‌స్టైల్ వారిని నేర ప్రపంచానికి దగ్గర చేస్తున్నాయి. ఇది కాలేజీ దశ నుంచే మొదలవుతోంది. చండీగఢ్‌లోని పంజాబ్ వర్సిటీ సింగర్లకు, యువ నేతలకు, గ్యాంగ్స్టర్లకు అడ్డాగా మారింది. లారెన్స్ బిష్ణోయి వంటి గ్యాంగ్స్టర్లు విద్యార్థి దశ నుంచే నేరాల్లో మునిగి తేలుతున్నారు. గతేడాది 70 ముఠాలకు చెందిన 500 మంది గ్యాంగ్స్టర్లను అరెస్టు చేశారు. అయినా పలు ముఠాలు రాష్ట్రంలో చురుగ్గా ఉన్నాయి. డబ్బు కోసం ఏమైనా చేస్తారు గ్యాంగ్ కల్చర్ ఎందరో గాయకుల నిండు ప్రాణాలు బలిగొంది. 2018 ఏప్రిల్‌లో పరమేశ్ వర్మ అనే గాయకున్ని డబ్బుల కోసం బెదిరించారు. ఇచ్చాక కూడా చంపేశారు. ఇది దిల్‌ప్రీత్‌సింగ్ దహాన్ అలియాస్ బాబా అనే గ్యాంగ్‌స్టర్ పనేనని విచారణలో తేలింది. డబ్బులతో కెనడా పారిపోయి అక్కడ సెటిలయ్యే ప్రయత్నాల్లో ఉండగా అతన్ని అరెస్టు చేశారు. సిద్ధూ హత్య తమ గ్యాంగ్ పనేనని అంగీకరించిన లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. విద్యార్థిగా ఉన్నప్పుడే గ్యాంగ్‌స్టర్‌గా పేరు మోసిన అతనిపై ఏకంగా 25 కేసులున్నాయి. జస్దీప్ సింగ్ అలియాస్ జగ్గు, గౌండర్ అండ్ బ్రదర్, బాంబిహ గ్రూపులు రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్నాయి. వీటిని అమెరికా, కెనడా నుంచి నడుపుతుంటారు. పంజాబీ మ్యుజీషియన్ మంక్రీత్ తుల్లాఖ్ తదితరులకు కూడా ఈ గ్రూపుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. తుపాకీ స్టైలే...! పంజాబీ పాప్ గీతాల రూటే వేరు. అవి అత్యంత ఆడంబరంగా రూపొందుతాయి. గాయకులు ఖరీదైన బట్టలు వేసుకుంటారు. షూస్, వాచీలు కూడా విదేశాల నుంచి తెప్పించినవే వాడతారు. మెడ నిండా బంగారు గొలుసులు, వేళ్లకు ఉంగరాలు, వజ్రాల వాచీలు అదనపు ఆకర్షణ. చేతిలో స్పోర్ట్స్ గన్ లేదంటే రైఫిల్ తప్పనిసరి. పాటల సాహిత్యం కూడా గన్ కల్చర్ చుట్టూ తిరుగుతుంది. సింగర్ చేతిలో రైఫిల్‌తో స్టైల్‌గా చిందులేస్తూ పాడుతుంటే జనం వెర్రెత్తిపోతుంటారు. ఇలా గన్ కల్చర్ థీమ్‌తో పాటలల్లే సిద్ధూ యూట్యూబ్ చానల్‌కు కోటికి పైగా సబ్స్క్రైబర్లున్నారు! ఇన్‌స్ట్రాగాంలో ఆయనను 85 లక్షలకు పైగా ఫాలో అవుతున్నారు!! పాంచ్ గోలీ (ఐదు తూటాలు) అనే పాటలో తుపాకీ ఎలా పేల్చాలో ఐదుగురు పోలీసు అధికారులు సిద్ధుకు నేర్పే సీన్లువివాదం రేపాయి. పాటల్లో ముఠా సంస్కృతిని, హింసను ప్రేరేపిస్తున్నారంటూ సిద్ధుపై 2020లో కేసులు నమోదయ్యాయి. దేశ జనాభాలో పంజాబ్ వాటా 2 శాతమైతే దేశం మొత్తమ్మీద ఉన్న తుపాకీ లైసెన్సుల్లో 10% అక్కడే ఉన్నాయి! అక్కడ 4 లక్షల దాకా గన్ లైసెన్సులున్నాయి. వాటిని తీసుకుంటున్న వారి సంఖ్య ఇటీవల శరవేగంగా పెరుగుతోందని నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. అంటే ప్రతి వెయ్యి మందిలో 13 మంది దగ్గర గన్స్ ఉన్నాయి. 2020లో రాష్ట్రంలో 362 కాల్పుల ఘటనలు జరిగాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘వైఎస్సార్ జయంతి రోజు మర్చిపోలేని అనుభూతి’
సాక్షి, విశాఖపట్నం : దశాబ్ద కాలంగా బకాయిలు చెల్లించకపోవడంతో సహకార చక్కెర కర్మాగారం రైతులు ఇబ్బందులు పడ్డారని పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల సమస్యలు తెలుసుకొని ముఖ్యమంత్రిగా తన బాధ్యత నెరవేర్చారని ప్రశంసించారు. కాగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని వైఎస్సార్ రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ హయాంలో వడ్డీలేని రుణాల కోసం రైతులకు బకాయి పడ్డ 1054 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారు. దీంతో పాటు రాష్ట్రంలోని 5 సహకార చక్కెర కర్మాగారాల పరిధిలో రైతులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన 54.6 కోట్ల రూపాయల పాత బకాయిలను కూడా సీఎం జగన్ విడుదల చేశారు. ('మాది ఎన్నటికి రైతుల పక్షపాతి ప్రభుత్వమే') మంత్రి అవంతి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ రైతు పక్షపాతిగా మరోసారి చరిత్రలో నిలిచిపోయారన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయానికి ఓ బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన జయంతి రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మర్చిపోలేని అనుభూతిని ఇచ్చారని అవంతి శ్రీనివాస్ కొనియాడారు. రైతు భరోసా కేంద్రాలు ద్వారా విత్తనాలు దగ్గర నుంచి పంట ఉత్పత్తి కొనుగోలు వరకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుండటం హర్షనీయమన్నారు.(‘ఆయన పాలన గుప్తుల కాలాన్ని గుర్తు చేసింది’) ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీకి చెందిన 5 వేల మందికి పైగా రైతులకు 10 కోట్ల రూపాయలు, తాండవకు చెందిన 4 వేల మంది రైతులకు సంబంధించి 9 కోట్ల రూపాయల బకాయిలు విడుదలయ్యాని తెలిపారు. రెండు చక్కెర కర్మాగారాలు బకాయిల చెల్లింపుకు నిధులు విడుదల చేయడం మాములు విషయం కాదని, బకాయిల చెల్లింపు తో మళ్ళీ చెరకు సాగు చేయడానికి రైతులు ముందుకు వస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. (అందుబాటులోకి 21 సంజీవని బస్సులు) టీడీపీ హయాంలో సహకార చక్కెర కర్మాగారాలు నడవలేని స్థితిలో ఉండేవని యలమంచలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కన్నబాబు విమర్శించారు. రెండేళ్లుగా బకాయిలు చెల్లించక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని బకాయిలను సెటిల్ చేయడం రైతులు ఊహించుకోలేదన్నారు. కాగా తాండవ, ఏటికొప్పాక రైతులకు ఈ రోజు ఎంతో పవిత్రమైన, అదృష్టమైన రోజు అని పాయకరావుపేట ఎమ్యెల్యే గొల్ల బాబురావు అన్నారు. -
వ్రతపురోహితులకు శుభవార్త
పారితోషికం బకాయిల చెల్లింపుకు కమిషనర్ ఓకే 15 నెలల మొత్తం రూ.రెండు కోట్లు రూ. కోటి కార్పస్‌ఫండ్‌కు, రూ.కోటి పురోహితులకు 250 మంది పురోహితులకు రూ.40 వేల చొప్పున లబ్ధి అన్నవరం: తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో పని చేస్తున్న 250 మంది వ్రతపురోహితులకు పారితోషికం బకాయిలను చెల్లించేందుకు దేవస్థానం కమిషనర్ అంగీకరించారు. వారు దీనికోసం 15 నెలలుగా ఆశగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఒక్కొక్క పురోహితునికి సుమారు రూ.80 వేలు ఎరియర్స్‌గా వస్తాయి. అయితే ఇందులో పురోహిత కార్పస్ ఫండ్ కింద 50 శాతం అంటే రూ.40 వేలు జమవుతుంది. మిగిలిన రూ.40 వేలు చెల్లిస్తారు. అన్నవరం దేవస్థానంలో 2015 జనవరిలో పెంచిన వ్రతాల టికెట్లకు సంబంధించి వ్రతపురోహితులకు చెల్లించాల్సిన15 నెలల పారితోషకం ఎరియర్స్‌ను చెల్లించేందుకు దేవాదాయశాఖ కమిషనర్ వైవీ ఆనూరాధ అంగీకరించినట్టు దేవస్థానం ఈఓ కే నాగేశ్వరరావు సోమవారం తెలిపారు. పారితోషికం ఎరియర్స్ చెల్లింపు విషయమై హైదరాబాద్‌లో రాష్ట్ర బ్రాహ్మణ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఐవీఆర్ కృష్ణారావు, కమిషనర్‌తో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆయన హైదరాబాద్ నుంచి ఫోన్లో ‘సాక్షి’ కి తెలిపారు. వారం రోజుల్లో ఈ ఎరియర్స్ చెల్లింపునకు సంబందించి ఆదేశాలు పంపుతామని చెప్పారన్నారు. ఆదేశాలు వచ్చిన వెంటనే పురోహితుల అకౌంట్స్‌లో ఎరియర్స్ బకాయిలు జమ చేస్తామని ఈఓ తెలిపారు. ఎరియర్స్ వివాదానికి కారణమేమిటంటే.. అన్నవరం దేవస్థానంలో గల రూ.125, రూ.200, రూ.500, రూ.1,116 వ్రతాల టిక్కెట్ రేట్లను 2015 జనవరి నెలలో రూ.150, రూ.300, రూ.700, రూ.1,500 కు పెంచుతూ దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సమావేశంలో చైర్మన్ రాజా ఐవీ రామ్‌కుమార్, అప్పటి ఇన్‌ఛార్జి ఈఓ ఈరంకి వేంకట జగన్నాథరావు నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు పెరిగిన వ్రతాల టిక్కెట్లను భక్తులకు విక్రయించడం ప్రారంభించి దేవాదాయశాఖ కమిషనర్‌కు తెలియచేశారు. అయితే ముందుగా తన అనుమతి తీసుకోకుండా వ్రతాల టిక్కెట్లు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ తన నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టారు. అయితే దేవస్థానంలో మాత్రం పెంచిన వ్రతాల టిక్కెట్లను యథాతథంగా విక్రయించారు. వ్రతపురోహితుల పారితోషికం చెల్లింపు ఇలా... వ్రతాల ఆదాయంలో 30 శాతం మొత్తాన్ని పారితోషికంగా 250 మంది పురోహితులకు చెల్లిస్తున్నారు. వ్రతాల టిక్కెట్లు పెంచినపుడు కూడా పెంచిన మొత్తం పై వచ్చిన ఆదాయంపై 30 శాతం కమిషన్‌గా వీరికి చెల్లించాలని దేవస్థానానికి, పురోహితులకు ఒప్పందం ఉంది. దాని ప్రకారం పెరిగిన వ్రతాల టిక్కెట్లను అనుసరించి పురోహితులకు పారితోషికం చెల్లించాలి. కానీ 2015 జనవరి నెలలో పెంచిన వ్రతాల టిక్కెట్లకు కమిషనర్ అనుమతి లేదు కనుక పాత టిక్కెట్ల ప్రకారం వచ్చిన ఆదాయం మీదనే లెక్కించి 30 శాతం పారితోషికం చెల్లిస్తున్నారు. అంటే 2015 జనవరి నెల నుంచి 2016 ఫిబ్రవరి వరకూ వీరికి పాత టిక్కెట్ల పైనే పారితోషికం చెల్లించారు. పెంచిన వ్రతాల రేట్ల ప్రకారం అయితే రూ.రెండు కోట్ల వరకూ వీరికి చెల్లించాల్సి ఉంది. వ్రతపురోహితుల కృతజ్ఞతలు కాగా, పారితోషికం ఎరియర్స్ చెల్లించేందుకు నిర్ణయించినందుకు వ్రతపురోహితులు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవీఆర్ కృష్ణారావు, కమిషనర్ వైవీ ఆనూరాధ, ఈఓ కే నాగేశ్వరరావులకు కృతజ్ఞతలు తెలిపారు. వ్రతపురోహిత ప్రముఖులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, వ్రతపురోహిత సంఘం అధ్యక్షుడు కర్రి సూర్యనారాయణ, కార్యదర్శి నాగాభట్ల రవిశర్మ, కోశాధికారి బట్టీశ్వర చక్రవర్తి తదితరులు కృతజ్ఞతలు తెలియచేశారు.