Art of Living Foundation
-
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సిబ్బంది, గ్రామస్తుల మధ్య ఘర్షణ
దొడ్డబళ్లాపురం: భూవివాదం నేపథ్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సిబ్బంది, గ్రామస్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుని కార్లు, బైక్‌లకు నిప్పంటించిన సంఘటన బెంగళూరు దక్షిణ తాలూకా వడేరహళ్లి గ్రామం వద్ద చోటుచేసుకుంది. వడేరహళ్లి గ్రామం పరిధిలో 137వ సర్వే నంబర్లో 36 కుంటల భూమికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు రాత్రికి రాత్రి ఫెన్సింగ్ వేసారు. అయితే ఇదే భూమిలో గ్రామస్తులు చాలా కాలంగా వ్యవసాయం చేస్తున్నారు. తమ భూమిలో ఎలా ఫెన్సింగ్ వేస్తారని గ్రామస్తులు మంగళవారం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సిబ్బందితో ఘర్షణపడ్డారు. ఘర్షణ తారాస్థాయికి వెళ్లి ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లోని మధువన ఫార్మ్‌హౌస్‌లో ఉన్న 8 బైక్‌లకు గ్రామస్తులు నిప్పంటించారు. సెక్యూరిటీ రూంను, మరో 5 బైక్‌లు, నాలుగు కార్లను కూడా ధ్వంసం చేసారు. ఘటనకు సంబంధించి గ్రామస్తులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సిబ్బంది పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. కగ్గలీపుర పోలీసులు ఇరువైపుల ఫిర్యాదులు స్వీకరించి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో పోలీసులను మోహరింపచేసారు. జిల్లా ఎస్పీ కార్తీక్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
'జైలుకైనా వెళ్తా కానీ.. ఫైన్ మాత్రం కట్టను'
న్యూఢిల్లీ: యమునా నది ఒడ్డున శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న 'ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం' నిర్వహణ విషయంలో ఇంకా వివాదాలు సద్దుమణగడం లేదు. రూ. 5 కోట్లు ప్రాథమిక జరిమానా కట్టి.. షరతులతో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. అయితే ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో జరిమానా కట్టబోమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' ఫౌండేషన్ స్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ స్పష్టం చేశారు. 'మేము ఏ తప్పూ చేయలేదు. మేం జైలుకైనా వెళ్తాంగానీ ఒక్కపైసా కట్టబోం' అని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు అధికారులు ఈ విషయాన్ని హరిత ట్రిబ్యునల్‌కు తెలిపారు. ఇప్పటివరకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ జరిమానా కట్టలేదని వెల్లడించారు. భారీ నిర్మాణాలతో అట్టహాసంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్ వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తవచ్చునని, యమునా నది పర్యావరణపరంగా దెబ్బతినవచ్చునని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీశ్రీ రవిశంకర్ మాట్లాడుతూ 'ఇది సాంస్కృతిక ఒలింపిక్స్ లాంటిందని, దీనిని ప్రతిఒక్కరూ స్వాగతించాలని కోరారు. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం కోసం వెయ్యి ఎకరాల్లో తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపడుతున్నామని, వాటిని తొందరగా తొలగించే అవకాశం కూడా ఉందని ఆయన చెప్పారు. శుక్రవారం ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యే అవకాశముంది. కానీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ కార్యక్రమానికి రావొద్దని నిర్ణయించుకున్నారు. -
శ్రీశ్రీ రవిశంకర్ సమ్మేళనానికి ప్రణబ్ రాం రాం...
న్యూఢిల్లీ: నగరంలోని యమునా నది తీరాన ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్’ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవి శంకర్ తలపెట్టిన ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం వివాదాస్పదం అవడంతో ఈ సమ్మేళనాన్ని ప్రారంభించాల్సిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన కార్యక్రమాన్ని రద్దు చేసుకొన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రణబ్ కార్యక్రమం రద్దయిందంటూ మంగళవారం రాష్ట్రపతి భవన్ నుంచి ఓ అధికార ప్రకటన వెలువడింది. ఈ ప్రపంచ స్థాయి సమ్మేళనానికి ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలు హాగరవుతున్నట్లు స్థానిక అన్ని పత్రికల్లో ఈ రోజు భారీ యాడ్స్ కూడా వెలువడ్డాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఖాతరు చేయకుండా ఫౌండేషన్ వర్గాలు రైతుల పంట పొలాలను, కూరగాయల తోటలను నేలమట్టం చేయడమే కాకుండా యమునా తీరాన 150 ఎకరాల స్థలంలో ఉన్న పెద్ద చెట్లను కూడా నేలమట్టం చేశారు. పూల చెట్లను చదును చేసి రోడ్లను నిర్మించారు. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సిఫార్సుతో 120 మంది సైనికుల సేవలను అక్రమంగా ఉపయోగించుకుంటున్నారు. వారు యమునా నదిపై ఆరు ఫ్లోటింగ్ వంతెనలు నయాపైసా తీసుకోకుండా నిర్మిస్తున్నారు. ఇలాంటి చర్యల కారణంగా యమునా నది పరీవాహక ప్రాంతానికి వలస వస్తున్న పక్షులు వెనుతిరిగి పోతున్నాయి. మార్చి 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మాత్రమే తమ సమ్మేళనం కొనసాగుతుందని, ఆ తర్వాత తాత్కాలిక నిర్మాణాలను తొలగిస్తామని శ్రీశ్రీ రవి శంకర్ చెబుతున్నారుగానీ, ఏవీ తొలగించినా ఆ ప్రాంతం ఎప్పటికీ సాధారణ స్థితికి రాదని పర్యావరణ నిపుణులు తెలియజేస్తున్నారు. తాము పర్యావరణానికి అనుకూలంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇదే మరో దేశంలో నిర్హహించినట్లుయితే తనకు రెడ్ కార్పెట్ స్వాగతం చెప్పేవారని రవి శంకర్ వాదిస్తున్నారు. పైగా సమ్మేళనం కోసం ఒక్క చెట్టును కూడా కూల్చలేదని ఆయన చెబుతున్నారు. చెట్ల చుట్టూ కూడా చదును చేస్తుండడం వల్ల చెట్లు కూలిపోతున్నాయని స్థానికలు చెబుతున్నారు. ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్’ 35వ వార్షికోత్సవం సందర్బంగా ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. 150 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో ఏడు ఎకరాల్లో 35 వేల మందికి సరిపడే భారీ స్టేజీని ఏర్పాటు చేశారు. స్టేజ్‌పైనా ప్రపంచ శాంతికి ప్రార్థనలు చేయడంతోపాటు భారత సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. -
ఊరంతా ఒకే కుటుంబం
మన ఊరు అదేదో సినిమాలో ‘మానవా మానవా’ అని పిలిస్తే ‘మానను గాక మానను’ అంటాడో తాగుబోతు. ఆ ఊళ్లో ఒకప్పుడు అలాంటి దృశ్యాలు ఎటు చూసినా కని పించేవి. వేళా పాళా లేకుండా మందు బాబులు ఊరి మీద పడేవాళ్లు. పనీ పాటా మానేసి మందులోనే మునిగి తేలేవారు. కానీ ఇప్పుడు అక్కడ మందు వాసనే రావట్లేదు. మందు అన్న పేరే వినబడ ట్లేదు. ఉన్నట్టుండి ఆ గ్రామంలో అంత మార్పు ఎలా వచ్చింది?! మన దేశంలోని అనేక కుగ్రామాలలో లాగే మహారాష్ట్రలోని కతేవాడిలో కూడా సరియైన రోడ్లు ఉండేవి కాదు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా ఉండేది కాదు. మద్య పానం, ధూమపానం, జూదం మొదలైన వ్యసనాలు గ్రామాన్ని పట్టి పీడించేవి. అయితే ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్’ ఈ ఊరిని దత్తత తీసుకున్న తరువాత పరిస్థితిలో పూర్తి మార్పు వచ్చింది. దుర్వ్యసనాల గ్రామం ఇప్పుడు ఆదర్శ గ్రామంగా ప్రశంసలందుకుంటోంది! ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్’ వారు అడుగుపెట్టేసరికి కతేవాడి పరిస్థితి భయంకరంగా ఉంది. గ్రామంలో డెబ్భై శాతం మంది మద్యానికి బానిసలై పోయారు. పని చేయకపోవడంతో సంపా దన ఉండేది కాదు. ఎక్కడ చూసినా పేద రికం. దానికి తోడు ఊళ్లో ఏ సౌకర్యాలూ ఉండేవి కాదు. ఈ పరిస్థితిని మార్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఊరిలో చాలా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఏర్పాటయ్యాయి. వీటిలో గ్రామస్తులందరినీ సభ్యులుగా చేర్చుకున్నారు. వారికి మద్యాన్ని దూరం చేశారు. బాధ్యతగా ఎలా నడుచుకోవాలో నేర్పారు. దాంతో ఒకప్పుడు గ్రామంలో మద్యం మీద రోజుకు వంద నుంచి రెండు వందల రూపాయల వరకు ఖర్చు చేసిన వాళ్లు కాస్తా ఇప్పుడు ఆ మొత్తాన్నీ ఇంటి కోసం, ఊరి కోసం వినియోగిస్తున్నారు. అలాగే ‘యస్హెచ్జీ’ల పుణ్యమా అని గ్రామంలో వడ్డీవ్యాపారం తగ్గిపోయింది. గ్రామస్తుల ఆర్థికస్థాయి మెరుగుపడింది. ప్రతి వ్యక్తీ స్థానిక బ్యాంకులో కొంత సొమ్మును డిపాజిట్ చేస్తున్నారు. ప్రతి ఇంటా సంపద చేరింది. ప్రతి కుటుంబంలో సంతోషం నెలకొంది. అందరి ఇళ్లలోనూ మరుగుదొడ్లతో పాటు అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. ఊరిలో చక్కని రోడ్లు ఉన్నాయి. విద్యుత్ ఉంది. డ్రైనేజీ వ్యవస్థ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల్లో ఐకమత్యం ఉంది. ‘మద్యం ముట్టను’, ‘పొగ తాగను’ అని గ్రామస్తులందరూ ప్రమాణం చేశారు. ఊరి యువకులు ఒక భారీ ర్యాలీ నిర్వహించి ఇళ్లు, దుకాణాల్లో ఉన్న సిగరెట్లు, చుట్టలు, బీడీలు, మద్యం అన్నిటినీ సేకరించి దహనం చేశారు. అందుకే ఇప్పుడు కతేవాడిలో మద్యం దుకాణాలుకానీ, తాగేవాళ్లు కానీ కనిపించరు. శుభ్రత విషయంలో కూడా కతేవాడి తన ప్రత్యేకతను చాటుకుంటోంది. గ్రామస్తులంతా కలిసి వీధులు, బహిరంగ ప్రదేశాలు, దేవాలయాలు మొదలైన ప్రదేశాలను శుభ్రం చేస్తుంటారు. భారీ ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం కూడా విజయవంతం అయింది. ఈ అభివృద్ధికి గాను ప్రభుత్వం నుంచి ‘నిర్మల్ గ్రామ్ అవార్డ్’ను, ‘సంత్ గాడ్గెబాబా’ అవార్డ్ కూడా అందుకుంది కతేవాడి. ఇదంతా ఎలా సాధ్యపడింది అని అడిగితే... ‘‘ఒకప్పుడు ఊళ్లో మా ఇల్లుంది అనుకునేవాళ్లం. ఇప్పుడు ఊరినే మా ఇల్లు అనుకుంటున్నాం. ఊరు అభివృద్ధి చెందితే మేము అభివృద్ధి చెందినట్లే కదా’’ అని చెప్తారు ఆ గ్రామస్తులు ఉద్వేగంగా. వారిని ఆదర్శంగా తీసుకుంటే ప్రతి గ్రామమూ ఆదర్శ గ్రామమౌతుంది! కతేవాడిలో చెప్పుకోదగ్గ మరో విశేషం ‘దాన్ పేటి’. షాప్కీపర్ లేకుండా షాప్‌ను నడిపే పథకం ఇది. ఈ షాప్‌లో తక్కువ ధరకే నాణ్యత కలిగిన సరుకులు ఉంటాయి. ప్రజలు తమకు కావలసినవి తీసుకొని దాని వెల ఎంతో ఆ సొమ్మును ‘దాన్ పేటీ’ అనే క్యాష్‌బాక్స్‌లో వేస్తారు. దాన్ని ఊరి బాగుకై వినియోగిస్తారు.