కాలిపోయిన వాహనాలు
దొడ్డబళ్లాపురం: భూవివాదం నేపథ్యంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సిబ్బంది, గ్రామస్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుని కార్లు, బైక్‌లకు నిప్పంటించిన సంఘటన బెంగళూరు దక్షిణ తాలూకా వడేరహళ్లి గ్రామం వద్ద చోటుచేసుకుంది.
వడేరహళ్లి గ్రామం పరిధిలో 137వ సర్వే నంబర్‌లో 36 కుంటల భూమికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు రాత్రికి రాత్రి ఫెన్సింగ్ వేసారు. అయితే ఇదే భూమిలో గ్రామస్తులు చాలా కాలంగా వ్యవసాయం చేస్తున్నారు. తమ భూమిలో ఎలా ఫెన్సింగ్ వేస్తారని గ్రామస్తులు మంగళవారం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సిబ్బందితో ఘర్షణపడ్డారు. ఘర్షణ తారాస్థాయికి వెళ్లి ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లోని మధువన ఫార్మ్‌హౌస్‌లో ఉన్న 8 బైక్‌లకు గ్రామస్తులు నిప్పంటించారు.
సెక్యూరిటీ రూంను, మరో 5 బైక్‌లు, నాలుగు కార్లను కూడా ధ్వంసం చేసారు. ఘటనకు సంబంధించి గ్రామస్తులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సిబ్బంది పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. కగ్గలీపుర పోలీసులు ఇరువైపుల ఫిర్యాదులు స్వీకరించి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో పోలీసులను మోహరింపచేసారు. జిల్లా ఎస్పీ కార్తీక్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment