శ్రీశ్రీ రవిశంకర్ సమ్మేళనానికి ప్రణబ్ రాం రాం...
న్యూఢిల్లీ: నగరంలోని యమునా నది తీరాన ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్’ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవి శంకర్ తలపెట్టిన ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం వివాదాస్పదం అవడంతో ఈ సమ్మేళనాన్ని ప్రారంభించాల్సిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన కార్యక్రమాన్ని రద్దు చేసుకొన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రణబ్ కార్యక్రమం రద్దయిందంటూ మంగళవారం రాష్ట్రపతి భవన్ నుంచి ఓ అధికార ప్రకటన వెలువడింది. ఈ ప్రపంచ స్థాయి సమ్మేళనానికి ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలు హాగరవుతున్నట్లు స్థానిక అన్ని పత్రికల్లో ఈ రోజు భారీ యాడ్స్ కూడా వెలువడ్డాయి.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను ఖాతరు చేయకుండా ఫౌండేషన్ వర్గాలు రైతుల పంట పొలాలను, కూరగాయల తోటలను నేలమట్టం చేయడమే కాకుండా యమునా తీరాన 150 ఎకరాల స్థలంలో ఉన్న పెద్ద చెట్లను కూడా నేలమట్టం చేశారు. పూల చెట్లను చదును చేసి రోడ్లను నిర్మించారు. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సిఫార్సుతో 120 మంది సైనికుల సేవలను అక్రమంగా ఉపయోగించుకుంటున్నారు. వారు యమునా నదిపై ఆరు ఫ్లోటింగ్ వంతెనలు నయాపైసా తీసుకోకుండా నిర్మిస్తున్నారు.
ఇలాంటి చర్యల కారణంగా యమునా నది పరీవాహక ప్రాంతానికి వలస వస్తున్న పక్షులు వెనుతిరిగి పోతున్నాయి. మార్చి 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మాత్రమే తమ సమ్మేళనం కొనసాగుతుందని, ఆ తర్వాత తాత్కాలిక నిర్మాణాలను తొలగిస్తామని శ్రీశ్రీ రవి శంకర్ చెబుతున్నారుగానీ, ఏవీ తొలగించినా ఆ ప్రాంతం ఎప్పటికీ సాధారణ స్థితికి రాదని పర్యావరణ నిపుణులు తెలియజేస్తున్నారు. తాము పర్యావరణానికి అనుకూలంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇదే మరో దేశంలో నిర్హహించినట్లుయితే తనకు రెడ్ కార్పెట్ స్వాగతం చెప్పేవారని రవి శంకర్ వాదిస్తున్నారు. పైగా సమ్మేళనం కోసం ఒక్క చెట్టును కూడా కూల్చలేదని ఆయన చెబుతున్నారు. చెట్ల చుట్టూ కూడా చదును చేస్తుండడం వల్ల చెట్లు కూలిపోతున్నాయని స్థానికలు చెబుతున్నారు.
‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్’ 35వ వార్షికోత్సవం సందర్బంగా ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. 150 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో ఏడు ఎకరాల్లో 35 వేల మందికి సరిపడే భారీ స్టేజీని ఏర్పాటు చేశారు. స్టేజ్‌పైనా ప్రపంచ శాంతికి ప్రార్థనలు చేయడంతోపాటు భారత సంస్కృతిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.