Article 14
-
కారుణ్య నియామకం హక్కుకాదు
న్యూఢిల్లీ: కారుణ్య నియామకం అనేది హక్కు కాదని, బాధితులకు ఊరడింపు మాత్రమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హఠాత్∙సంక్షోభాన్ని, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడానికి బాధిత కుటుంబానికి కారుణ్య నియామకం దోహదపడుతుందని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమేనని, ఆర్టికల్ 16 ప్రకారం చట్టంలో నిర్దేశించిన నిబంధనల మేరకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని తేల్చిచెప్పింది. 24 ఏళ్ల క్రితం మృతిచెందిన వ్యక్తి కుమార్తెకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగం ఇవ్వాలంటూ కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గతవారం తోసిపుచ్చింది. కేరళలోని ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్‌లో పనిచేసే ఓ వ్యక్తి 1995లో ఏప్రిల్‌లో విధి నిర్వహణలో ఉండగానే మృతిచెందాడు. అప్పట్లో ఆయన కుమార్తె మైనర్. కారుణ్య నియామకం కింద తనకు ఉద్యోగం ఇవ్వాలంటూ మేజరైన తర్వాత ఆమె కంపెనీకి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఇవ్వలేమంటూ యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించింది. బాధితురాలిని కంపెనీలో చేర్చుకోవాలని సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు. హైకోర్టు డివిజన్ బెంచ్ సైతం దీన్ని సమర్థించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కంపెనీ యాజమాన్యం సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం సెప్టెంబర్ 30న తీర్పును వెలువరించింది. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లు రద్దు
న్యూఢిల్లీ: పదోన్నతులకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్ చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ‘ప్రభుత్వ ఉద్యోగులకు రిజర్వేషన్ల ఆధారంగా ప్రమోషన్లు కల్పించే చట్టం – 2002’ ను రద్దు చేసిన అత్యున్నత న్యాయస్థానం.. ఈ చట్టం ‘కాచ్ అప్ రూల్’కు విరుద్ధమని పేర్కొంది. ప్రమోషన్లకు రిజర్వేషన్లు కల్పించే ముందు.. ప్రాతినిధ్య కొరత, వెనకబాటుతనం, పూర్తి సామర్థ్యం తదితరాలు ఉన్నాయో లేదో పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. ఈ చట్టంలోని అంశాలు ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు), ఆర్టికల్ 16 (ప్రభుత్వ సర్వీసుల అవకాశాల్లో సమానత్వం)ల పరిధి దాటి ఉన్నాయని న్యాయమూర్తులు జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రాతినిధ్య కొరత, వెనకబాటుతనం తదితరాలు ఉన్నప్పుడే రిజర్వేషన్ల ద్వారా ప్రమోషన్లు ఇవ్వాలని వివరించింది.