ఫైరింగ్ శిక్షణలో అపశ్రుతి.. ఇద్దరు ‘హైదరాబాద్’ అగ్నివీరుల మృతి
నాసిక్: మహారాష్ట్రలోని దేవ్లాలీ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో శిక్షణ సమయంలో చోటుచేసుకున్న ఘటనలో ఇద్దరు అగ్నివీర్లు ప్రాణాలు కోల్పోయారు. మృతులను హైదరాబాద్లోని ఆర్టిలరీ సెంటర్కు చెందిన వారిగా గుర్తించారు. నాసిక్ జిల్లాలోని దేవ్లాలీ ఫైరింగ్ రేంజ్లో శుక్రవారం అగ్నివీర్లకు ఫీల్డ్ గన్ ఫైరింగ్ శిక్షణ ఇస్తున్నారు. అనుకోకుండా పేలి తూటాలు తగలడంతో గన్నర్ గోహిల్ విశ్వరాజ్ సిన్హ్(20), గన్నర్ సైకత్(21) తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని దేవ్లాలీలోని ఆస్పత్రికి తరలించారు. వారు అప్పటికే చనిపో యినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు హవల్దార్ అజిత్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రమాదవశాత్తు చోటుచేసుకున్న మరణాలుగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు దేవ్లాలీ క్యాంప్ పోలీసులు తెలిపారు. ఘటనపై ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ఆదేశించారు.