తెలుగోత్సవం
ప్రపంచ తెలుగు రచయితల మూడో మహాసభలు ప్రారంభం
ఉదయం నుంచి రాత్రి వరకు సాగిన పలు సదస్సులు
సభల్లో పాల్గొన్న పలువురు {పముఖులు, రచయితలు, కళాకారులు, కవులు
వాడీవేడిగా చర్చలు, ఛలోక్తులు
విజయవాడ : నగరంలో సాహితీ శోభ ఉట్టిపడుతోంది. అచ్చమైన పంచెకట్టులో ప్రముఖులు అటూ.. ఇటూ తిరుగుతూ తెలుగుదనాన్ని చాటారు. పలువురు ప్రముఖులు తెలుగు గొప్పదనాన్ని వివరించారు. మాతృభాష సేవలో తరలించాలని, కమ్మనైన అమ్మ భాషను విశ్వవ్యాపితం చేయాలని పిలుపునిచ్చారు. పటమట శ్రీ కృష్ణవేణి స్కూలులో శనివారం ప్రారంభమైన ప్రపంచ తెలుగు రచయితల మూడో మహాసభలు ఉదయం నుంచి రాత్రి వరకు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు పలు దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఎంతోకాలం తర్వాత కలిసిన కవులు, రచయితలు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా చేసిన భోజన ఏర్పాట్లు బాగున్నాయని అతిథులు అభినందనలు తెలిపారు. సభలను జ్యోతి వెలిగించి కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రారంభించారు. సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి, మహాసభల ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, కార్యనిర్వాహక అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రముఖ సాహితీవేత్త గొల్లపూడి మారుతీరావు, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, ప్రముఖ పత్రికా సంపాదకులు ఎంవీఆర్ శాస్త్రి, కె.శ్రీనివాస్, శాసనమండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దె అనూరాధ, ఆకాశవాణి కేంద్ర సంచాలకులు మంజులూరి కృష్ణకుమారి పాల్గొన్నారు. ప్రారంభ సభలో రచయితలు, సాహిత్యాభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తల్లి భాషలోని తియ్యదనం అనుభవిస్తేనే తెలుస్తుందని చెప్పారు. తాను చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తల్లి ద్వారా భాష నేర్చుకునే అవకాశం కోల్పోయానని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే, ఎంతోమంది తల్లులు తనకు అన్నం పెట్టి దీవించారని, వారు చెప్పిన మాటలు, వారు వండి వడ్డించిన భోజనం ఎప్పుడూ తనకు గుర్తుకు వస్తూ ఉంటాయని చెప్పారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తన తల్లి ఎంతగానో అభిమానించి, ఆదరించిందని చెబుతూ ఉద్వేగానికి లోనయ్యారు. తెలుగును విశ్వవ్యాప్తం చేయాలంటే భాష ద్వారా ఉపాధి అవకాశాలు పెరగాల్సి ఉందన్నారు.
ఆలోచింపజేసిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాటలు..
ఈ సభలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ చెప్పిన మాటలు పలువురిని ఆలోచింపజేశాయి. ఎన్నిసార్లు సభలు నిర్వహించినా ప్రయోజనం పెద్దగా ఉండదని, బతుకు దారి చూపించే భాషగా తెలుగు మారితే తప్పకుండా ప్రపంచ భాషగా గుర్తింపు లభిస్తుందని ఆయన ఉద్ఘాటించారు. తెలుగులోని రచనలు అన్ని భాషల్లోకీ అనువాదం చేసి భాష గొప్పదనాన్ని చాటి చెప్పాలని కోరారు. తెలుగు భాషలో అన్ని వృత్తి విద్యలకు సంబంధించిన కోర్సులను బోధించే విధంగా మారాలని, అప్పుడు మాతృభాష ద్వారానే ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. అందరూ తెలుగు భాష గురించి గొప్పగా చెప్పాలంటే కవులు, కళాకారులు, రచయితలు కలిసి ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.
ఆకట్టుకున్న ప్యారిస్ పరిశోధకుడు
ప్యారిస్ దేశానికి చెందిన డేనియల్ నిగర్స్ మాట్లాడుతున్న సమయంలో అందరూ ఆసక్తిగా విన్నారు. విదేశీయుడైనప్పటికీ తెలుగు భాషపై పరిశోధన చేస్తున్నందున భాషకు ప్రాచీన కాలం నుంచి ఉన్న ఔన్నత్యాన్ని ఆయన వివరిస్తుండగా.. అందరూ చప్పట్లు కొట్టి అభినందించారు. ఆయన తెలుగు మాట్లాడేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడినప్పటికీ, మాతృభాష కాకపోవడంతో అది సహజమేనని పలువురు పేర్కొన్నారు. గొల్లపూడి మారుతీరావు, సుద్దాల అశోక్‌తేజ, తనికెళ్ల భరణి మహాసభలకు ఆకర్షణగా నిలిచారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్, తనికెళ్ల భరణిల పంచెకట్టు ఆకట్టుకుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి సుమారు 600 మంది ప్రతినిధులు, ఏడుగురు విదేశీ ప్రతి నిధులు సదస్సుకు హాజరయ్యారు. ఆదివారం మరో ప్రతినిధి హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన రచయితల సంఘం ప్రముఖులు సదస్సుల్లో పాల్గొన్నారు.