దారి దోపిడీ!
- ఆర్టీపీపీ కేంద్రంగా హవా నడుపుతున్న పోట్లదుర్తి బ్రదర్స్
- రూ.2.5కోట్ల రోడ్డు కాంట్రాక్టు పనులు అధికరేట్లకు అప్పగింత
- 16 శాతం తక్కువ ధరకు టెండర్ కోట్ చేసిన కంపెనీకి మొండిచేయి
- నిబంధనలకు తిలోదకాలిస్తున్న యంత్రాంగం
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆ ఇరువురు బ్రదర్స్ ఆర్టీపీపీని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రికి సన్నిహితులమంటూ బెదిరింపులే పెట్టుబడిగా క్రమం తప్పకుండా లబ్ధిపొందుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా, వారు సూచించిందే శాసనంగా అక్కడి యంత్రాంగం వ్యవహరిస్తోంది. మొన్న గ్రీనరీ ఏర్పాటుకు అధిక రేట్లతో టెండర్లు అప్పగించగా, ప్రస్తుతం రూ.2.5కోట్ల రోడ్డు కాంట్రాక్టు పనిని అధిక రేట్లకు కట్టబెట్టారు. తక్కువ ధరలకు టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టు సంస్థను తప్పించడంలో అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వెర సి పోట్లదుర్తి బదర్స్కు అండగా నిలుస్తున్నారు.
రామేశ్వరం నుంచి ఆర్టీపీపీ వరకు 2.5 కిలో మీటర్ల పరిధిలో సిమెంటు రోడ్డు నిర్మాణానికి ఆర్టీపీపీ శ్రీకారం చుట్టింది. తాజాగా ఆ పనిని 3.99 శాతం అధిక రేట్లకు పోట్లదుర్తి బ్రదర్స్‌కు అప్పగించినట్లు సమాచారం. అదేపనికి 16 శాతం తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థను అధికారులు తిరస్కరించారు. టెండరుదారులను తప్పించి ఏక టెండర్‌కు అధిక రేట్లకు అప్పగించి స్వామిభక్తి ప్రదర్శించారు.
మొన్న గ్రీనరీ....నేడు సిమెంటు రోడ్డు...
ఆర్టీపీపీలో కార్మికుల నియామకం మొదలుకుని కాంట్రాక్టుపనుల వరకూ తమ ఆధిపత్యమే చెల్లాలని పోట్లదుర్తి బ్రదర్స్ తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచారు. ఇటీవల 6వ యూనిట్ పరిధిలో గ్రీనరీ ఏర్పాటుకు రూ. 52 లక్షలతో టెండర్లు పిలిచారు. హైదరాబాద్‌లో డెరైక్టర్ల పరిధిలో నిర్వహించిన ఈ టెండర్లలో అధికార పార్టీ అనే పరపతి ఉపయోగించి అధిక రేట్లకు దక్కించుకున్నారు. అధిక రేట్లకు ఏకైక టెండరు దాఖలైతే రద్దుచేసి తిరిగి టెండర్లు పిలవాలని నిబంధనలు చెబుతున్నాయి. అయినా 4శాతం ఎక్కువ ధరలకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు టెండర్ అప్పగించారు. ప్రస్తుతం సిమెంటు రోడ్డు నిర్మాణానికి టెండర్లు నిర్వహించగా 16శాతం తక్కువ ధరలకు సరస్వతి కన్స్ట్రక్షన్స్ కంపెనీ టెండర్ దాఖలు చేసింది. మరో రెండు సంస్థలు తర్వాత తక్కువ ధరలకు కోట్ చేశాయి. అయితే ఈ మూడింటిని అధికారులు తిరస్కరించారు. కాంట్రాక్టు చేపట్టేందుకు కావాల్సిన అర్హతలపై సాకు చూపి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. కాగా 3.99 శాతం అధిక రేట్లతో రిత్విక్ కన్స్ట్రక్షన్స్కు అప్పగించినట్లు సమాచారం.
రూ.50 లక్షలు ప్రజాధనం పరులపాలు..
రామేశ్వరం నుంచి ఆర్టీపీపీ వరకు సిమెంటు రోడ్డు పనుల్లో రూ.50లక్షల ప్రజాధనం పరులుపాలు కానుంది. రూ.2.5 కోట్లతో చేపట్టే ఆ రోడ్డు పనిని 16శాతం తక్కువ ధరలకు చేపట్టేందుకు సరస్వతి కన్స్ట్రక్షన్స్ ముందుకు వచ్చింది. ఆ సంస్థకు అప్పగించి ఉంటే రూ.40లక్షలు ప్రజాధనం మిగిలేది. అంటే రూ.2.1కోట్లకే ఆ రోడ్డు మనుగడలోకి వచ్చేది. అదే రోడ్డుకు ఆర్టీపీపీ అదనంగా మరో రూ.10లక్షలు కేటాయించింది. అంటే రూ.40 లక్షలు మిగలాల్సింది పోయి, రూ.10లక్షలు అదనంగా అప్పగిస్తోంది. వెరసి రూ.50లక్షలు ధనాన్ని వృథా చేస్తోందని పలువురు వాపోతున్నారు.
ఆర్టీపీపీ ఎస్ఈ శేషారెడ్డి ఏమన్నారంటే....
‘టెండర్లు హైదరాబాద్‌లో సీఈ పరిధిలో నిర్వహించారు. అక్కడే ఫైనల్ చేశారు. ఎవరు పాల్గొన్నారనే విషయం మాకు తెలియదు. రిత్విక్ కన్స్ట్రక్షన్స్కు కాంట్రాక్టును అప్పగించారు. వారితో పనులు మొదలు పెట్టిస్తున్నాం. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు మేము వ్యవహరిస్తాం’ అని ఎస్ఈ శేషారెడ్డి వివరించారు.