సెన్సారైనా.. ప్రజలకు చేరిన నాటకం
గ్రంథం చెక్క
చెకోవ్, గోర్కీ లిద్దరూ తీరికగా కబుర్లు చెప్పుకుంటూ పట్టణ వీధుల్లో తెల్లటి చప్టాల మీద నడుస్తుండేవాళ్లు. రాత్రి అయేసరికి ఆర్టు థియేటర్ నాటకాలకి పోయి చూస్తూ కాలక్షేపం చేసేవాళ్లు. అప్పుడే చెకోవ్, గోర్కీని ఓ నాటకం రాయమని ప్రోత్సహించాడు. గోర్కీకి నాటక రంగం కొత్త. ప్లాటు తయారుచేశాడు. బెస్సిమినోవ్ కుటుంబ కఠినజీవితాన్ని చిత్రిస్తూ గోర్కీ తొలి నాటకం ‘ఫిలిస్టైన్స్’ (శిష్టులు) రచించాడు. నాటక రచనలో అతను చేయి తిరిగినవాడు కాడు. రాసి, మళ్ళీ రాసి మార్పులు చేసేడు. కానీ తృప్తి లేదు.
ఒక గొప్ప సాహిత్యవేత్త నాటకరచన విషయంలో ఏమన్నాడంటే- ‘‘మొదట్లో అయిదంకాల కష్టాంత నాటకం రాయి. సంవత్సరం పోయేక దాన్నే మూడంకాల నాటకంగా మార్చు. ఇంకో ఏడాది పోనిచ్చి దాన్ని ఏకాంక సుఖాంత నాటికగా కత్తిరించుకో. మరో ఏడాది గడవనిచ్చి, ఏకాంకికను పొయ్యిలో పారేయ్!’’
గోర్కీ ఈ సలహానే అనుసరించాడు. కానీ తన నాటకాన్ని మాత్రం పొయ్యిలో మాత్రం పారేయలేదు. ‘శిష్టులు’లో గోర్కీ తన చిన్ననాటి నుంచి ఎరిగి వున్న మానవుల్ని చిత్రించాడు. పట్టణాలలో చిన్న యిళ్లలో వుంటూ ఉక్కిరి బిక్కిరిగా నివసిస్తూండే వాళ్ళే ఈ ‘శిష్టులు’. వాళ్ల జీవితం అందులో చిత్రితమైంది. అది తృప్తి నివ్వక, తరువాత కొత్త నాటకంలో కోటీశ్వరుల వీధిలో ఉన్న బికారుల జీవితాన్ని చిత్రించాడు, ‘నికృష్ట జీవితం’ అని పేరె ట్టాడు.
ఇందులోని పాత్రలన్నీ గోర్కీ జీవితంలో సహచరులుగా గడిపినవారివే. ఆ నాటకంలోని ప్రతి వాక్యమూ ఏ సామాజిక విధానం కింద మానవుల్లో అత్యధిక సంఖ్యాకులు జీవించడానికి హక్కు లేకుండా చేయబడుతున్నారో, ఆ విధానం మీదే నిప్పులు చెరుగుతూ, దాన్ని దగ్ధపటలం చేసింది. నాటకంలోని కొన్ని వాక్యాలను ప్రభుత్వం సెన్సారైతే చేసింది కానీ, నాటక ముఖ్య సందేశం జనంలోకి వెళ్లకుండా మాత్రం చేయలేకపోయింది.
- మహీధర జగన్మోహనరావు
అనువాద రచన ‘గోర్కీ జీవితం’ నుంచి
(ప్రపంచ ప్రసిద్ధ రచయిత మాగ్జిమ్ గోర్కీ వర్ధంతి రేపు)