ఆయిల్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం
సిద్దిపేట, న్యూస్‌లైన్: మెదక్ జిల్లా సిద్దిపేట పట్టణ శివారులోని ఓ ఆయిల్ మిల్లులో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ. కోటి విలువైన ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన జరిగినట్టు సమాచారం. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది చొరవతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు...స్థానిక రాంనగర్‌లోని ఎర్ర చెరువు పక్కన గల అరుణ్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన ఆయిల్ మిల్ నుంచి శనివారం తెల్లవారుజాము 5.30 గంటల ప్రాంతంలో పొగలు రావడాన్ని వాచ్‌మన్ సిద్ధిరాములు గమనించాడు. షట్టర్ తీసి చూడగా మంటలు చెలరేగాయి. వెంటనే బయటకు వచ్చి అరవడంతో చుట్టు పక్కల వారితోపాటు ఆయిల్ మిల్ యజమాని లక్ష్మణ్ బంధుమిత్రులు వందల సంఖ్యలో హుటాహుటిన తరలివచ్చి మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. సిద్దిపేట ఫైర్ ఆఫీసర్ శ్రవణ్ నేతృత్వంలో ఫైర్ ఇంజన్, సిబ్బంది మంటలను ఆర్పడం ప్రారంభించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో గజ్వేల్ నుంచి మరో ఫైర్ ఇంజన్‌ను తెప్పించారు. నీరు సరిపోకపోవడంతో 12 వాటర్ ట్యాంకులను తెప్పించారు.
దీంతో మంటలు ముందు భాగంలోని షెడ్డుకు వ్యాపించలేదు. మిల్లులోని వివిధ రకాల వంట నూనెలు, ప్యాకింగ్ మిషన్లు, విద్యుత్ మోటార్లు, ప్యాకింగ్ సామగ్రి దగ్ధమైంది. సుమారు 10 గంటల కృషి తరువాత పరిస్థితి అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మంటలతో భవనం గోడలు, పార్టీషన్ భాగం, షెడ్డు పైకప్పు రేకులు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో రూ. కోటి విలువైన ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీధర్ సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాజిద్, వీఆర్వో లింగం పంచనామా నిర్వహించారు.
రూ. కోటి నష్టం:
లక్ష్మణ్, ఆయిల్ మిల్లు యజమాని
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని ఆయిల్ మిల్లు యజమాని లక్ష్మణ్ తెలిపారు. వివిధ రకాల వంట నూనెలు, సున్నితమైన మిషనరీలు, ప్యాకింగ్ మెటీరియల్స్ దగ్ధమయ్యాయన్నారు. షెడ్డు పూర్తిగా ధ్వంసమైందన్నారు. రూ. కోటి రూపాయల నష్టం జరిగిందన్నారు.