మేం అడగ్గానే టైటిల్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు : పవన్ కల్యాణ్
‘‘సప్తగిరి ‘గబ్బర్‌సింగ్’లో ఓ సీన్ చేశాడు. ఆ సీన్లో మేమిద్దరం కలిసి నటించలేదు కానీ, బాగా చేశాడు. అప్పట్నుంచి కలవాలనుకుంటున్నా. ఇప్పటికి కుదిరింది. నన్నిక్కడికి రప్పించింది నాపై అతనికున్న ప్రేమే’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. కమెడియన్ సప్తగిరి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’. అరుణ్ పావర్ దర్శకత్వంలో శ్రీసాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్‌పై డా. రవి కిరణ్ నిర్మించారు. రోషిణి కథానాయిక. విజయ్ బుల్గానిక్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని పవన్‌కల్యాణ్ విడుదల చేశారు.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ -‘‘నాతో శరత్‌మరార్ తీస్తున్న చిత్రానికి ‘కాటమరాయుడు’ టైటిల్ అనుకున్నాం. సప్తగిరి చిత్రానికి ఆ టైటిల్ రిజిస్టర్ చేయించారు. కానీ, పెద్ద మనసుతో మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. నేను సినిమాల్లో నటిస్తా కానీ, తక్కువగా చూస్తా. నేను చేసినవాటిలో ఇప్పటికీ రెండు సినిమాలు చూసుకోలేదు. ట్రైలర్ చూశాక సప్తగిరి సినిమా చూడాలనిపిస్తోంది.. చూస్తా’’ అన్నారు. ‘‘ఇంతమంది మెగాభిమానుల మధ్య ఓ మెగా అభిమాని ఆడియో ఫంక్షన్ జరుగుతుందని ఊహించలేదు.
చిన్నప్పట్నుంచి చిరంజీవిసార్ను అభిమానిస్తూ పెరిగా. నిజాయతీ గల అభిమానిని కాబట్టే పవన్‌సార్ వచ్చారు’’ అని సప్తగిరి అన్నారు. ‘‘సినిమా ఎలా తీయాలో త్రివిక్రమ్సార్ దగ్గర నేర్చుకున్నా. నన్ను ఆశీర్వదించడానికి పవన్ సార్ వచ్చినందుకు హ్యాపీ’’ అని దర్శకుడు అన్నారు. ‘‘తండ్రీ కొడుకుల మధ్య జరిగే కథ ఇది’’ అని డా. రవి కిరణ్ అన్నారు.