నేతాజీపై నిఘా... నిజం కాదు!
సురయ్యా హసన్ బోస్... అరవింద్‌బోస్ భార్య. పేరు చివరిలో బోస్ అనే పదం చెప్పకనే చెబుతోంది... అరవింద్‌బోస్ సుభాష్‌చంద్రబోస్ బంధువని. అవును... అరవింద్‌బోస్... సుభాష్ చంద్రబోస్‌కి స్వయాన మేనల్లుడు. సురయ్యా హసన్‌కి బోసు కుటుంబంతో ఆ ఒక్క బంధమే కాదు... ఆమె పినతండ్రి యాబిద్ హుస్సేన్ సఫ్రానీ చంద్రబోస్‌కి పర్సనల్ సెక్రటరీ. అరవింద్‌బోస్‌ని ప్రేమించి పెళ్లిచేసుకున్న సురయ్యా వస్త్ర కుటీర పరిశ్రమ స్థాపకురాలుగా సుపరిచితురాలు. నేతాజీ మరణానంతరం ఆయన కుటుంబంపై దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రు నిఘా పెట్టించారనే వార్తల సందర్భంగా సురయ్యా హసన్బోస్ని పలకరిస్తే ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు...
...::: భువనేశ్వరి
మీరు మొదటిసారి అరవింద్‌బోస్‌ని ఎప్పుడు కలిశారు?
నేను ఢిల్లీలో ‘హాండ్లూమ్ హాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పోర్ట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా’ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో ఆయన్ని మొదటిసారి కలిశాను. స్నేహం ప్రేమగా మారింది. తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి జరిగింది.
మీరు పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనేనా?
అవును. మా నాన్నగారు సయ్యద్ భద్రు హుస్సేన్. గాంధీ సిద్ధాంతాలను పాటిస్తూ ప్రచారం చేస్తుండేవారు. హైదరాబాద్ యాబిడ్స్‌లో మొదటి వస్త్ర కుటీర పరిశ్రమను స్థాపించిన వ్యక్తి. నేను ఒక్కగానొక్క అమ్మాయిని. ఇంటర్మీడియట్ చదువు పూర్తయ్యాక నాన్నగారి పరిశ్రమలోనే అసిస్టెంట్ మేనేజర్‌గా నాలుగేళ్లు పనిచేశాను. ఇంతలో ఢిల్లీలో ఉన్న కంపెనీలో ఉద్యోగ అవకాశం వస్తే అక్కడికి వెళ్లి పనిచేశాను.
మీ చిన్నాన్న యాబిద్ హుస్సేన్ సఫ్రానీ చంద్రబోస్‌గారి పర్సనల్ సెక్రటరీ మాత్రమే కాదు రైట్‌హ్యాండ్ అంటారు? మీకు తెలిసిన వివరాలు
చిన్నాన్నంటే బోస్‌గారికి చాలా నమ్మకం. బోస్‌గారి గొప్పతనం గురించి తప్ప బయటవారి దగ్గర, మా దగ్గర కూడా ఎలాంటి రహస్య విషయాలు చెప్పేవారు కాదు. నా భర్త అరవింద్బోస్కి చిన్నాన్న అంటే చాలా అభిమానం. అలా నాతో ఏర్పడ్డ పరిచయమే పెళ్లి వరకూ తీసుకెళ్లింది.
మీ అత్తవారింటి గురించి చెప్పండి
వాళ్లు బెంగాళీలు. సంప్రదాయ హిందూ కుటుంబం. కోడలిగా ఒక ముస్లిం అమ్మాయి ఇంట్లో అడుగుపెడితే ఎలా రిసీవ్ చేసుకుంటారోనని అనుకున్నాను. కానీ అరవింద్ కుటుంబమంతా ఆయనకంటే ఎక్కువగా ఆత్మీయంగా ఆహ్వానించారు.
అరవింద్‌బోస్ ఏం చేస్తుండేవారు?
మా పెళ్లయ్యేనాటికే ఆయన కలకత్తాలో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా పనిచేస్తున్నారు. ఆయనికి మేనమామ చంద్రబోస్ అంటే ప్రాణం. ఆయన బాటలోనే నడిచేవారు. ఆయన ఎమ్ఎ చదివారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో వార్తాపత్రికలు చదివి...వాటిలోని ముఖ్యాంశాలను యువతకు బోధించేవారు.
నెహ్రు కుటుంబానికి, చంద్రబోస్ కుటుంబానికి సంబంధాలు ఎలా ఉండేవంటారు?
చాలా మంచి సంబంధాలు ఉండేవి. మా నాన్నగారి తరపునైనా, బోసుగారి కుటుంబమైనా అందరం గాంధీ అడుగుజాడల్లో నడిచినవాళ్లమే. బోసుగారి కుటుంబానికి, నెహ్రు కుటుంబానికి రాకపోకలు ఉండేవి. ఇరు కుటుంబాల ఆలోచనలు హుందాగా ఉండేవి. చిన్నాన్న నెహ్రుగారి నాయకత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో పనిచేసినపుడు ఆ ఇద్దరి కుటుంబాల అనుబంధం గురించి చెబుతుండేవారు.
మీరు తిరిగి హైదరాబాద్‌కి ఎప్పుడు వచ్చేశారు?
మాకు పిల్లలు లేరు. పెళ్లయిన పదేళ్లకే నా భర్త అరవింద్‌బోస్ గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలోనే మా చిన్నాన్న తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి నన్ను తీసుకుని హైదరాబాద్‌కి వచ్చేశారు. ఇక్కడ టోలిచౌకిలో పదెకరాల పొలం కొనిచ్చారు. ఈ పొలంలో 1985లో కుటీర పరిశ్రమ స్థాపించాను. నా ఇల్లు కూడా దీనికి ఆనుకునే ఉంటుంది. నిజాం కాలంనాటి వస్త్ర తయారీ, హస్తకళలకు నెలవుగా మారిన మా పరిశ్రమలో భర్తను పోగొట్టుకున్న మహిళలకు ఉపాధి లభిస్తుంది. చిన్నాన్న పేరుతో ‘సఫ్రానీ మెమోరియల్ స్కూల్’ని కూడా స్థాపించాను. ఒకపక్క కుటీర పరిశ్రమ, మరోపక్క స్కూలు పనుల్లో నాకు 88 ఏళ్ల వయసొచ్చిందన్న విషయమే తెలియలేదు.
మీ భర్త చనిపోయాక... మీ అత్తింటివారితో సంబంధాలు కొనసాగుతున్నాయా?
అందరూ టచ్‌లోనే ఉంటారు. నా చిన్నాడబడుచు తన చివరి రోజుల్లో కూడా నాతోనే గడిపింది. ఏడాదికి ఒకటిరెండుసార్లు తప్పనిసరిగా కలకత్తా వెళ్లొస్తుంటాను.
నెహ్రు హయాంలో 1948 నుండి 1968 వరకూ నేతాజీ కుటుంబంపై నిఘా ఉంచిన వార్తల గురించి విన్నారా?
మన దేశంలో ఇలాంటి వార్తలు పుట్టడం, తర్వాత మెల్లగా మరుగున పడిపోవడం జరుగుతూనే ఉంటాయి. కేవలం రాజకీయ ప్రయోజనం కోసమేనని నా అభిప్రాయం. లేదంటే ఇన్నేళ్ల తర్వాత ఇలాంటి వార్తలు బయటకి రావడమేంటి!
నేతాజీ కుటుంబానికి, నెహ్రు కుటుంబానికి మధ్య చాలా మంచి సంబంధాలుండేవి. నిఘా విషయం నిజమైతే మొదట ఇబ్బంది పడాల్సిన వ్యక్తి మా చిన్నాన్న సఫ్రానీ. ఎందుకంటే ఆయన పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి. జర్మనీ నుంచి సింగపూర్‌కి వెళ్లిన సబ్‌మెరైన్‌లో నేతాజీతోపాటు ప్రయాణించిన వ్యక్తి ఆయన. ఆయన అడుగుజాడలన్నీ ఎరిగిన మనిషి. నా భర్త అరవింద్‌బోస్ కుటుంబంపై కూడా నిఘా ఉండాలి కదా! నాకున్న అనుభవం మేరకు ఇలాంటి సంఘటనలేవీ జరగలేదు.
మా రెండు కుటుంబాల సంగతి పక్కన పెడితే మిగతా బంధువులతో కూడా మాకు పరిచయాలు బాగానే ఉండేవి. మా మధ్యన ఇలాంటి విషయాలెప్పుడూ చర్చకు రాలేదు. నేతాజీలాంటి గొప్పవ్యక్తిని మనం గుర్తుచేసుకునే విధానం ఇది కాదు. ఏదో ఒక ఆసక్తికరమైన వార్తలరూపంలో తప్ప మంచి సందర్భంలో ఆ మహనీయున్ని తలుచుకోలేకపోతున్నందుకు విచారంగా ఉంది.
- సురయ్యా