‘నోటా’కు బాగానే పడ్డాయ్!
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘నోటా’కు భారీగా ఓట్లు పడ్డాయి. రాజకీయ పార్టీలపై ఆశలు కోల్పోయిన చాలామంది ‘పై అభ్యర్థుల్లో ఎవరూ కాదు’(నోటా) బటన్ను నొక్కారు. రాజకీయ పోటీ తీరును మార్చడానికి దీనికి ఓటేశామని వారు చెప్పారు. ఓటర్లకు అభ్యర్థులందర్నీ తిరస్కరించే హక్కు ఉందని, దీని కోసం ఈవీఎంలలో బటన్ను ఏర్పాటు చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశంపై రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరంలతోపాటు ఢి ల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘నోటా’ను అమల్లోకి తీసుకొచ్చారు.
తమకు నోటా బటన్ను నొక్కే మంచి అవకాశం ఈ ఎన్నికల్లో లభించిందని పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురి వాసి అరవింద్ త్యాగి చెప్పారు. తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను ఆయన ఏకరువు పెట్టారు. ఈ బటన్ను ఇదివరకే తీసుకొచ్చి ఉంటే బాగుండేదని మరో ఓటరు చెప్పారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్ధన్ పోటీ చేస్తున్న కృష్ణ నగర్లో చాలా మంది యువతీయువకులు నోటాకు ఓటేశామన్నారు. అయితే ఈ దీని గురించి తమకు తెలియదని దక్షిణ ఢిల్లీలోని చాలామంది ఓటర్లు తెలిపారు. నోటా వల్ల ఉపయోగం లేదని, దానికి ఓటేసే బదులు ఇంట్లోనే కూర్చుంటే సరిపోతుందని సర్దార్ బజార్ అనే వ్యక్తి అన్నాడు.