లంక క్రికెటర్లు బిస్కెట్లు తినకూడదట..!
దంబుల్లా: ఇక శ్రీలంక క్రికెటర్లు మ్యాచ్ లు ఆడే క్రమంలో డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న సమయంలో బిస్కెట్లు తినకూడదట. లంక క్రికెటర్లు బిస్కెట్లు తినడంపై ఆ జట్టు యాజమాన్యం నిషేధం విధిస్తూ నిర్ణయించింది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ జట్టు మేనేజర్ అసాంక గురుసిన్హా తమ ఆటగాళ్లకు బిస్కెట్ల నిషేధాన్ని ధృవీకరించారు.
'మ్యాచ్ మధ్యలో విరామ సమయంలో ఆటగాళ్లు బిస్కెట్లు తినడం సహజంగా జరుగుతుంది. అయితే మా జట్టు ఫిజియో, శిక్షకుడు ఇచ్చిన ఆదేశాల కారణంగానే ఆటగాళ్లకు బిస్కెట్లు సరఫరా చేయడంపై నిషేధం విధించాం'అని గురుసిన్హా చెప్పారు. దీనికి సంబంధించి శ్రీలంక క్రికెటర్ల నుంచి ఎటువంటి ఇబ్బంది కలగలేదని, బిస్కెట్లు నిషేధంపై కనీసం చర్చించలేదన్నారు. ఇదిలా ఉంచితే, దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి తన పదవికి రాజీనామా చేశానంటూ వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని గురుసిన్షా తెలిపారు. అయితే క్రికెటర్లు ఎందుకు బిస్కెట్లు తినకూడదు అనే దానిపై మాత్రం గురుసిన్హా వివరణ ఇవ్వలేదు.