భూములు, ఆస్తుల విక్రయంపై యథాతథస్థితి
సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఇతర ఆస్తుల విక్రయం విషయంలో యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని హైకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విశాఖ ఉక్కు కర్మాగారం ఆస్తులను విక్రయించే ప్రతిపాదన ఏదీ ఇప్పటివరకు లేదన్న కేంద్ర ప్రభుత్వ వాదనను హైకోర్టు రికార్డ్ చేసింది. కేవలం కర్మాగారంలో 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణకే కట్టుబడి ఉన్నామన్న వాదనను కూడా రికార్డ్ చేసింది. కర్మాగారానికి చెందిన ఒక్క ఎకరా భూమిని కూడా తాకబోమని కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) బి. నరసింహశర్మ హైకోర్టుకు వివరించారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, పెట్టుబడుల ఉపసంహరణ, భూములు, ఆస్తుల విక్రయం తదితర వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 19కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.ప్రైవేటీకరణ నిర్ణయంపై ‘పిల్’లు..విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలుచేస్తూ మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌తో పాటు సువర్ణరాజు అనే వ్యక్తి కూడా వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు.అలాగే, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, రేషన్ కార్డుదారులకు ఉద్యోగాలిస్తామన్న గత హామీ మేర ఉద్యోగాలిచ్చేలా ఆదేశాలివ్వాలంటూ పలువురు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై జస్టిస్ శేషసాయి ధర్మాసనం గురువారం వాటిపై మరోసారి విచారణ జరిపింది.గత విచారణ సమయంలో ధర్మాసనం, అసలు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏ చట్ట ప్రకారం ప్రైవేటీకరిస్తున్నారు? ప్రైవేటీకరణకు బదులు ప్రత్యామ్నాయాలు చూడాలంటూ సీఎం జగన్మోహన్రెడ్డి రాసిన లేఖపై ఏం నిర్ణయం తీసుకున్నారు? ప్రైవేటీకరణకు ముందు కార్మికులు, ఉద్యోగులు, కర్మాగారంతో ముడిపడి ఉన్న వారిని సంప్రదించారా? అన్న వివరాలను తమ ముందుంచాలని ఆదేశించిన విషయం తెలిసిందే.పాత కౌంటర్‌నే అటూఇటూగా మార్చి..ఈ వ్యాజ్యాలు గురువారం విచారణకు రాగానే, కేంద్ర ప్రభుత్వ న్యాయవాది సీవీఆర్ రుద్రప్రసాద్ స్పందిస్తూ, గత విచారణ సమయంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు కౌంటర్ దాఖలు చేశామని చెప్పారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ.. గతంలో దాఖలు చేసిన అంశాలనే అటూ ఇటూగా మార్చి, కొద్దిగా ఇంగ్లీష్ పదాలు చేర్చి తాజా కౌంటర్ దాఖలు చేశారని చెప్పారు. ధర్మాసనం అడిగిన వివరాలు ఆ కౌంటర్లో లేవని ఆయన తెలిపారు. ప్రైవేటీకరణ కాకుండా స్టీల్‌ప్లాంట్‌ను లాభాల బాట పట్టించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారని, దాని గురించి కౌంటర్లో ప్రస్తావనే లేదన్నారు.ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) బి. నరసింహ శర్మ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి లేఖకు ఆర్థిక శాఖ 2021లోనే సమాధానం ఇచ్చారని తెలిపారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నది ఇప్పటివరకు సూత్రప్రాయ నిర్ణయమేనని, ఇప్పుడు ఎలాంటి పురోగతి లేదన్నారు. ఇక ఈ ప్లాంట్ భూములు అమ్మే ప్రతిపాదన కూడా ఏదీలేదని.. ఒక్క ఎకరా భూమిని కూడా తాకబోమన్నారు.అలా అయితే స్టేటస్ కో కొనసాగిస్తారా?ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. అలా అయితే స్టీల్‌ప్లాంట్ భూముల విషయంలో స్టేటస్ కో కొనసాగిస్తారా? ఆ మేర ఉత్తర్వులు జారీచేయమంటారా? అని ప్రశ్నించింది. అందుకు నరసింహ శర్మ అంగీకరించారు. ఈ సమయంలో పిటిషనర్ తరఫు న్యాయవాదుల్లో ఒకరైన యలమంజుల బాలాజీ స్పందిస్తూ.. ఏఎస్జీ చెప్పిన వివరాలను రికార్డ్ చేయాలని కోరగా.. ధర్మాసనం రికార్డ్ చేసి భూముల విషయంలో స్టేటస్ కో కొనసాగించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి విచారణను జూన్ 19కి వాయిదా వేసింది.