గిన్నిస్‌లోకి ప్రఖ్యాత గాయనీమణి
సాక్షి, చెన్నై: పలు భాషలలో ఎన్నో పాటలు పాడి ప్రేక్షకుల అభిమానాన్ని చొరగొన్న గానకోకిల పి.సుశీల ప్రపంచ రికార్డు సాధించారు. ప్రపంచ స్థాయి గిన్నిస్ బుక్‌లో తన పేరును నమోదు చేసుకున్నారు. ఎన్నో మధుర గీతాల మణిహారం సుశీల. 60 ఏళ్ల సంగీత ప్రవాహంలో ఈ గానకోకిల ఆలపించినన్ని పాటలు ప్రపంచంలో ఏ గాయనీ పాడలేదు. అందుకే ఆమె అత్యధిక పాటలు ఆలపించిన గాయనీమణిగా గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించారు. ఇప్పటి వరకూ అధిక పాటలు పాడిన గాయనీగా గిన్నిస్‌లోకి ప్రఖ్యాత గాయనీమణి ఆశాభోంస్లే రికార్డును బద్దలు కొట్టి తన పేరును నమోదు చేసుకున్నారు.
దీన్ని ధ్రువపరుస్తూ గిన్నిస్‌బుక్ నిర్వాహకులు పి.సుశీలకు ధ్రువ పత్రాన్ని అందించారు. పలు భాషలలో 18330 పాటలు పాడిన ఏకైక గాయనీమణిగా ఏషియన్ బుక్ రికార్డులోనూ తన పేరును నమోదు చేసుకున్నారు. ఈ ఘనత తనకు అవకాశాలు కల్పించి ప్రోత్సహించిన దివంగత సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు, అప్పరాజు, ఎస్.రాజేశ్వరరావులాంటి వారికే దక్కుతుందని పి.సుశీల మంగళవారం చెన్నైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు.