తెలుసా... ఆట జరుగుతోంది అక్కడ!
అష్గబాట్ (తుర్క్మెనిస్తాన్): కరోనా వైరస్ చేతిలో ప్రపంచం విలవిల్లాడుతోంది. పోలీసులు, వైద్య, పారిశుధ్య వర్గాలు మినహా ఎవరూ రోడ్డుమీద తిరిగే పరిస్థితే లేదు. అన్ని దేశాల పరిస్థితి ఇంతే. కానీ తుర్క్మెనిస్తాన్లో మాత్రం ఫుట్‌బాల్ సీజన్ ఆదివారం పునఃప్రారంభమైంది. అది కూడా గప్‌చుప్‌గా కాదు... వేల ప్రేక్షకుల మధ్య కావడం అక్కడ మరో విశేషం. ఎందుకంటే తుర్క్మెనిస్తాన్లో కరోనా వైరస్ లేదు. కరోనా మహమ్మారి వ్యాపించని కొన్ని దేశాల్లో తుర్క్మెనిస్తాన్ కూడా ఉంది. ఈ దేశంలో ఒక్క కోవిడ్–19 కేసు లేకపోవడంతో లాక్డౌన్ విధించే పరిస్థితి రాలేదు. అయినప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచనల మేరకు గత నెల అక్కడ 8 జట్లు తలపడే ఫుట్‌బాల్ లీగ్‌ను నిలిపివేశారు. టోర్నీని సస్పెండ్ చేసే సమయానికి మూడు మ్యాచ్‌లు జరిగాయి. నెల తర్వాత ఈవెంట్ మొదలవడంతో ప్రేక్షకులు ఉత్సాహం చూపుతున్నారు.