దెయ్యం పట్టిందని కొడుకును చంపేశాడు
జలదంకి: మూఢ నమ్మకంతో కన్నకొడుకునే ఓ తండ్రి కడతేర్చిన సంఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధారం చోటు చేసుకుంది. జలదంకి మండలం గట్టుపల్లికి చెందిన గోపిశెట్టి శ్రీనివాసులుకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కొడుకు అశోక్ (23) ఐటీఐ చదివి ఇంటివద్ద ఉంటున్నాడు. సన్నకారు రైతైన శ్రీనివాసులుకు మూఢభక్తి ఎక్కువ. కుటుంబకష్టాలు గట్టెక్కేందుకు ఇటీవల ఓ స్వామీజీని ఆశ్రయించాడు.
అశోక్‌కు దెయ్యం పట్టిందని, కాళ్లు చేతులు కట్టివేసి నోట్లో గుడ్డలు పెట్టి పొట్టపై ఒత్తాలని.. అప్పుడు నీకు కూడా ఒంట్లోకి దేవుడు వచ్చి మీ కుమారుడికి దెయ్యం వదులుతుందని, కుటుంబం బాగుపడుతుందని అతను చెప్పినట్లు సమాచారం. దీంతో శ్రీనివాసులు భార్య మాధవి, రెండో కుమారుడిని ఒప్పించి అశోక్‌ను తాళ్లతో కట్టి నోట్లో గుడ్డలు పెట్టి పొట్టపై గట్టిగా ఒత్తారు. దీంతో అశోక్‌కు ఊపిరాడక మృతి చెందాడు. అనంతరం హడావుడిగా అశోక్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.