Ashok Chawla
-
యస్ బ్యాంక్ చైర్మన్‌గా బ్రహ్మ్‌దత్!
న్యూఢిల్లీ: యస్ బ్యాంక్ చైర్మన్‌గా డైరెక్టర్లలో ఒకరైన బ్రహ్మ్ దత్ పేరును రిజర్వు బ్యాంకుకు యస్‌బ్యాంక్ సిఫారసు చేసినట్లు తెలియవచ్చింది. గత నెలలో చైర్మన్ పదవికి అశోక్ చావ్లా రాజీనామా చేయడంతో ఈ పదవి ఖాళీ అయింది. యస్ బ్యాంక్ ఈ పదవికి బ్రహ్మ్‌దత్‌ను ఎంపిక చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దత్ ఇప్పటికే డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని, ఆయనకు బ్యాంక్‌కు సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన ఉందని, అందుకే చైర్మన్ పదవికి ఆయనను బ్యాంక్ ఎంపిక చేసిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ఉద్యోగిగా రిటైరైన దత్ ప్రస్తుతం యస్ బ్యాంక్‌లో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం సీఈఓగా, ఎమ్‌డీగా ఉన్న రాణా కపూర్ పదవీ కాలాన్ని వచ్చే నెల 31 తర్వాత పొడిగించడానికి ఆర్బీఐ అంగీకరించలేదు. వచ్చే నెల 9న జరిగే బోర్డ్ సమావేశంలో రాణా కపూర్ వారసుడిని ఎంపిక చేస్తామని యస్ బ్యాంక్ వెల్లడించింది .ఫోర్టిస్‌లో 2 శాతం వాటా విక్రయం ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లో 2 శాతం వాటాను విక్రయించామని యస్ బ్యాంక్ తెలిపింది. 2.13 శాతం వాటాకు సమానమైన 1,23,37,323 షేర్లను దశల వారీగా విక్రయించినట్లు వెల్లడించింది. ఈ ఏడాది నవంబర్ 21 నాటికి ఫోర్టిస్ హెల్త్‌కేర్‌లో యస్ బ్యాంక్‌కు 9.33 శాతం వాటా ఉంది. -
గవర్నెన్స్ లోపాలే రాణా ఉద్వాసనకు కారణం
ముంబై: యస్ బ్యాంక్ సీఈవోగా రాణా కపూర్‌ను కొనసాగించే ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ నిరాకరించడానికి గవర్నెన్స్ లోపాలు, నిబంధనలను పాటించడంలో వైఫల్యాలే కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 17న అప్పటి చైర్మన్ అశోక్ చావ్లాకు రాసిన లేఖలో ఆర్బీఐ ఈ విషయాలు పేర్కొన్నట్లు వివరించాయి. రుణాల నిర్వహణ విధానాలకు సంబంధించి బ్యాంక్‌లో పెద్ద యెత్తున అవకతవకలు కనిపించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆ లేఖలో పేర్కొంది. అలాగే, రాణా కపూర్ జీతభత్యాలు భారీగా పెంచే ప్రతిపాదనపై కూడా ఆర్బీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఈవోల బోనస్‌లను తగ్గించాలంటూ బ్యాంక్‌ల బోర్డులకు గతంలో ఇచ్చిన సూచనలకు ఇది విరుద్ధంగా ఉందని తెలిపింది. ప్రస్తుత ఎండీ, సీఈవో సారథ్యంలో యస్ బ్యాంక్ పాలన, నిర్వహణ, పర్యవేక్షణ విషయాలపై తమకున్న అనుమానాలకు ఈ పరిణామాలు ఊతమిచ్చేవిగా ఉన్నాయని లేఖలో ఆర్బీఐ పేర్కొంది. ఇవే కాక గత మూడు ఆర్థిక సంవత్సరాలుగా యస్ బ్యాంక్ పలు మార్గదర్శకాలను తీవ్ర స్థాయిలో ఉల్లంఘించిందని పేర్కొంటూ.. సీఈవోగా కపూర్ కొనసాగింపును తిరస్కరించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1లోగా కొత్త సీఈవోను నియమించాలని ఆదేశించింది. చావ్లా ఈ మధ్యే బోర్డు నుంచి తప్పుకోగా.. ఆర్బీఐ లేఖలోని అంశాలపై స్పందించేందుకు యస్ బ్యాంక్ నిరాకరించింది. బ్యాంకు, ఆర్బీఐకి మధ్య జరిగే ఉత్తర, ప్రత్యుత్తరాలన్నీ గోప్యనీయమైనవని పేర్కొంది. అయితే, ఆర్బీఐ లేవనెత్తిన పలు అంశాలను ఇప్పటికే పరిష్కరించినట్లు, ఇదే విషయం ఆర్బీఐకి కూడా తెలియజేసినట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 1 7న ఆర్బీఐ లేఖ పంపించడానికి ముందే చాలా అంశాలు పరిష్కృతమైనట్లు వివరించాయి. రాణా కపూర్ పదవీకాలాన్ని ఆర్బీఐ కుదించినప్పట్నుంచి యస్ బ్యాంక్‌లో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. చైర్మన్ అశోక్ చావ్లాతో పాటు ముగ్గురు డైరెక్టర్లు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో యస్ బ్యాంక్ షేరు గణనీయంగా పతనమవుతోంది. ఏకంగా 40 శాతం క్షీణించి ప్రస్తుతం 33 నెలల కనిష్ట స్థాయుల్లో ట్రేడవుతోంది. -
యస్ బ్యాంక్ చైర్మన్ అశోక్ చావ్లా రాజీనామా
ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యస్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్‌టైమ్ చైర్మన్ అశోక్ చావ్లా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో స్వతంత్ర డైరెక్టర్ వసంత్ గుజరాతి కూడా రాజీనామా చేసినట్లు యస్ బ్యాంక్ బుధవారం వెల్లడించింది. ఇవి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. అయిదేళ్ల పాటు అదనపు డైరెక్టర్ (స్వతంత్ర)గా ఉత్తమ్ ప్రకాశ్ అగర్వాల్ నియామకానికి బోర్డు ఆమోదముద్ర వేసినట్లు యస్ బ్యాంక్ తెలిపింది. -
ఎస్ బ్యాంక్ కొత్త నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్
న్యూఢిల్లీ: ప్రముఖ ప్రయివేటు రంగ బ్యాంక్ ఎస్ బ్యాంక్ కొత్త నియామకాన్ని చేపట్టింది. ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి, కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఛైర్మన్ అశోక్‌చావ్లా ను పార్ట్ టైమ్ నాన్ ఎగ్జిక్యూటివ్ గానియమించింది. ఇప్పటికే బోర్డు లో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న చావ్లా నియామాకంపై ముందుగా రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఆమోదము పొందింది. అనంతరం అక్టోబర్ 30న ఆయన బాధ్యతలు స్వీకరించారు. తాత్కాలిక ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న రాధాసింగ్ పదవీకాలం శనివారంతో ముగియడంతో బ్యాంకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీఎస్ ఈ ఫైలింగ్ లో తెలిపింది. మూడేళ్లపాటు చావ్లా ఈ పదవిలో కొనసాగునున్నారని పేర్కొంది. కాగా ఇండిపెండెంట్ డైరెక్టర్ గా ఉన్న చావ్లా ఈ ఏడాది మార్చిలోనే యస్ బ్యాంకు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. -
ప్రభుత్వ ప్రభావం నుంచి బయటపడాలి
పీఎస్బీలకు రఘురామ్ రాజన్ సూచన న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రభావం నుంచి బయటపడితే ప్రభుత్వ రంగ బ్యాంకుల పోటీతత్వం మరింత పెరుగుతుందని రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. పోటీ పెరిగితే సామర్థ్యం మెరుగవుతుందని చెప్పారు. న్యూఢిల్లీలో మంగళవారం నిర్వహించిన భారతీయ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఐదో వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత్‌లోని అనేక పీఎస్‌బీల పనితీరు మెరుగుపర్చడానికి పాలనలోనూ, కార్యకలాపాల నిర్వహణలోనూ మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు. రూ.8 వేల కోట్ల జరిమానాలు... సీసీఐ చైర్మన్ అశోక్ చావ్లా ప్రసంగిస్తూ, వ్యాపారంలో పోటీతత్వానికి వ్యతిరేకమైన పద్ధతులు పాటించిన పలు సంస్థలపై సీసీఐ ఇప్పటివరకు రూ.8 వేల కోట్ల పెనాల్టీలు విధించిందని పేర్కొన్నారు. వివిధ రంగాలకు చెందిన కేసులు వీటిలో ఉన్నాయని చెప్పారు.