కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న మహిళ
విజయనగర్‌కాలనీ : భార్యా భర్తల గొడవలో మనస్థాపం చెందిన ఓ ఇల్లాలు వంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన ఆసీఫ్‌నగర్ పోలీస్ స్టేసన్ పరిదిలో ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలు... గుడిమల్కాపూర్ పి.ఇంద్రారెడ్డి పూల మార్కెట్ పక్కన ఉన్న గుడిసెల్లో ఏసు, భార్య సుగుణ (25)తో కలిసి గత కొంత కాలంగా నివాసం ఉంటున్నారు. కాగా ఏసు దినసరి కూలీగా పని చేస్తుండగా సుగుణ ఇళ్లలో పని చేస్తుంది.
వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా తరుచు గొడవపడే భర్తతో వేగలేక మనస్థాపం చెందిన సుగుణ ఆదివారం రాత్రి ఎవరు లేని సమయంలో వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. బాధకు తాళలేక సుగుణ కేకలు వేయడంతో స్థానికులు వచ్చి మంటలను ఆర్పారు. 108కు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ విషయమై ఆసీఫ్‌నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లును సాక్షి ప్రశ్నించిగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.