ఎట్టకేలకు క్రికెట్ లెజండ్ మౌనం వీడాడు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ నోరు విప్పారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత.. దాదాపు మూడేళ్ల నుంచి మౌనంగానే ఉన్న ఆయన రెండు ప్రశ్నలు అడిగి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. అద్భుతమైన ఆటతీరుతో, మెరుపువేగంతో చెలరేగి సెంచరీలు సాధించిన లెజండ్ పార్లమెంటులో తొలి షాట్ కొట్టాడు.
2012 జూన్‌లో రాజ్యసభకు నామినేటెడ్ సభ్యుడిగా ఎన్నికైన ఈ క్రికెట్ లెజెండ్ సోమవారం మాట్లాడారు. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ముంబై మెట్రోకు సంబంధించి ఒక ప్రశ్నను అడిగారు. కోల్‌కతాలో ఉన్నట్లు ముంబై మెట్రోకు కూడా ప్రత్యేక జోన్ కావాలని కోరారు. దీనికి రైల్వే మంత్రి మెట్రో సేవల విభాగంలో కోల్‌కతాకు ఒక ప్రత్యేకస్థానం ఉందని, దానితో ముంబైని పోల్చలేమన్నారు. ప్రత్యేక జోన్‌గా ప్రకటించడం సాధ్యం కాదని సమాధానం చెప్పారు. దీంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో మార్పులకు సంబంధించిన మరో ప్రశ్నను కూడా సచిన్ అడిగారు.
కాగా క్రీడారంగంలో అందించిన విశిష్ట సేవలకు గాను రాజ్యసభకు ఎన్నికైన లిటిల్ మాస్టర్ ఇటీవలి కాలంలో విమర్శల పాలయ్యారు. వివిధ సందర్భాల్లో సభకు హాజరు కాకపోవడం, హాజరైనా మౌనంగా ఉండటంపై విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే.