గ్రామీణ భారతంలో పసిడికి తగ్గనున్న డిమాండ్
న్యూఢిల్లీ: గ్రామీణ భారతంలో ఈ ఏడాది పసిడికి డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండనుంది. వర్షపాతం అంతంత మాత్రంగానే ఉండటం.. పొదుపుపై ప్రతికూల ప్రభావం చూపనుండటమే ఇందుకు కారణం. అయితే, దీపావళి పండుగ సమయంలో మాత్రం బంగారానికి డిమాండ్ కాస్త మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే, ప్రభుత్వం పుత్తడి దిగుమతులపై ఆంక్షలెన్ని పెట్టినప్పటికీ దీర్ఘకాలిక డిమాండ్ స్థిరంగానే ఉండనుంది.
గురువారం అసోచాం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) భారత విభాగం ఎండీ సోమసుందరం ఈ విషయాలు తెలిపారు. పసిడికి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు, అక్కడి రైతు కుటుంబాల నుంచే డిమాం డ్ ఉంటోంది. సాధారణంగా గ్రామీణ కుటుంబాలు తాము చేసే పొదుపులో సుమారు 7-8% మొత్తాన్ని బంగారం కొనేందుకు ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం వర్షపాతం మళ్లీ మెరుగయ్యేలా ఉన్నప్పటికీ.. గ్రామీణ కుటుంబాల పొదుపు మొత్తాలు తగ్గిపోతున్నాయి. ఈ ప్రభావం .. బంగారం డిమాండ్‌పై కూడా పడే అవకాశాలు ఉన్నాయని సోమసుందరం తెలిపారు. గతేడాది దేశీయంగా 974 టన్నులుగా ఉన్న పసిడి డిమాండ్ ఈ ఏడాది 850-950 టన్నులకు తగ్గొచ్చని పేర్కొన్నారు. పసిడి దిగుమతులపై ఆంక్షలను సడలించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన సూచించారు.
మరోవైపు, హాల్‌మార్క్ ఆభరణాలకు విశిష్ట గుర్తింపు సంఖ్య(యూఐఎన్) జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) డెరైక్టర్ జనరల్ సునీల్ సోని తెలిపారు. కొనుగోలుదారు మోసపోయిన పక్షంలో సదరు ఆభరణాన్ని తయారుచేసినవారిని, హాల్‌మార్కింగ్ చేసిన వారిని పట్టుకునేందుకు దీనివల్ల వీలవుతుందన్నారు.