టిడిపి ఎమ్మెల్సీ కుమారుడిపై కేసు నమోదు
అనంతపురం: సాక్షి ప్రతినిధులపై దాడికి సంబంధించి టిడిపి ఎమ్మెల్సీ శమంతకమణి కుమారుడు అశోక్ సహా నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతపురంలో తెలుగుదేశం పార్టీ నేతలు పింఛన్ లబ్ధిదారుల జాబితాను ఇష్టానుసారం తయారు చేయడమే కాకుండా, ఆ దృశ్యాలను చిత్రీకరించిన సాక్షి ఫొటోగ్రాఫర్, విలేకరిపై నిన్న దాడి చేసిన విషయం తెలిసిందే.శింగనమల నియోజకవర్గం టీడీపీ నేతలు నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో సమావేశమై ఏకపక్షంగా లబ్ధిదారుల ఎంపికను చేపట్టారు. జాబితాల నుంచి వైఎస్సార్ సీపీ, ఇతర పార్టీల సానుభూతిపరుల పేర్లను తొలగించారు. ఆ జాబితాను టీడీపీ వారితో నింపుతున్న విషయం బయటకు వచ్చింది. దీంతో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సాక్షి ఫొటోగ్రాఫర్ జి. వీరేష్, విలేకరి సి. రమణారెడ్డి అక్కడకు వెళ్లారు. వారిని చూసి ఎమ్మెల్సీ శమంతకమణి కుమారుడు అశోక్, గార్లదిన్నె మాజీ మండలాధ్యక్షుడు ముంటిమడుగు శ్రీనివాసరెడ్డి, ఆయన సోదరుడు కేశవరెడ్డి, శింగనమల ఎంపీటీసీ చిదంబరంలు వారి అనుచరులతో మూకుమ్మడిగా దాడి చేశారు. వారిని అసభ్య పదజాలంతో దూషి స్తూ, కొట్టుకుంటూ ఫంక్షన్ హాల్ కింది గదిలో ఉన్న ఎమ్మెల్సీ శమంతకమణి వద్దకు ఈడ్చుకెళ్లారు. ఈలోపు కొందరు ఫొటోగ్రాఫర్ వద్ద ఉన్న కెమెరా లాక్కున్నారు. అందులోని చిత్రాలను తొలగించి కెమెరాను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అక్కడ నుంచి సాక్షి ప్రతినిధులను ఈడ్చుకుంటూ వెళ్లి గేటు బయటకు నెట్టేశారు.
ఈ ఘటనకు సంబంధించి అశోక్పైన, మరో ముగ్గురిపైన పోలీసులు 143,323,506,302 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్సీ శమంతకమణి కుమారుడు అశోక్, గార్లదిన్నె మాజీ మండలాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఆయన సోదరుడు కేశవరెడ్డి, శింగనమల ఎంపీటీసీ సభ్యుడు చిదంబరంలపై కేసు నమోదు చేసినట్లు రూరల్ సీఐ శుభకుమార్ తెలిపారు
ఇదిలా ఉండగా, సాక్షి ప్రతినిధులపై టిడిపి నేతల దాడికి నిరసనగా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
**