అట్రాసిటీ కేసుపై ఏఎస్పీ విచారణ
ములగపూడి:
ఓ గిరిజన సర్పంచ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు అడ్డుకోవడమే కాకుండా అతనిని కులంపేరుతో దూషించిన మండల టీడీపీ అధ్యక్షుడు, ఎంపీటీసీ సభ్యుడు అంకంరెడ్డి సతీష్‌కుమార్‌పై నమోదైన అట్రాసిటీ కేసును ఏఎస్పీ అద్నాన్ నయీమ్ గురువారం విచారించారు. ములగపూడిలో రెండు ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ఒకదానిలో ఎంపిటీసీ సభ్యుడు, ఎస్సీపేటలోని ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ గుమ్మడి అశోక్ కుమార్ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ చేయాలంటూ అధికారులు సర్కు్యలర్ జారీ చేశారు. ఆమేరకు సర్పంచ్ అశోక్‌కుమార్ ఎస్సీపేటలోని పాఠశాల వద్దకు పాలకవర్గ సభ్యులు, తన అనుచరులతో వెళ్లారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు ఆ పాఠశాల హెచ్ఎం సర్పంచ్ అశోక్‌కుమార్‌ను ఆహ్వానించగా పక్కనే ఉన్న ఎంపీటీసీ సభ్యుడు సతీష్‌కుమార్ తనను నెట్టేశారని ఏఎస్పీకి ఆయన తెలిపారు. ‘నువ్వెవడవురా కొండనాకొడకా’ అంటూ తనను అగౌరవపరచి మనస్తాపానికి గురిచేశాడని వాపోయారు. తన చెక్ పవర్ రద్దు చేయిస్తానని సతీష్‌కుమార్ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.lఅనంతరం ఎస్సీపేటలోని ప్రాథమిక పాఠశాలను ఏఎస్పీ పరిశీలించారు. ఆయన వెంట తుని సీఐ జి.చెన్నకేశవరావు, కోటనందూరు కానిస్టేబుల్ బాలరాజు ఉన్నారు.