నవలోకం
సాక్షి, ఏలూరు : తెలుగు నేల రెండుగా చీలిపోయింది. నవ్యాంధ్రప్రదేశ్‌ను కొత్తగా నిర్మించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలోనూ మార్పులు, చేర్పులు అనివార్యం అవుతున్నాయి. ఇన్నాళ్లూ ఎన్నికల కారణంగా క్షణం తీరిక లేకుండా గడిపిన అధికారులు ఆ ప్రక్రియ ముగియడంతో పాలనపై దృష్టి సారించారు. ముఖ్యం గా రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో చేపట్టాల్సిన పనులను వేగవంతం చేస్తున్నారు. కార్యాలయూలన్నీ ఒకేచోటజిల్లా కేంద్రమైన ఏలూరు నగరంలో ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రధాన కార్యాలయూలు ఉన్నాయి.
ము ఖ్యంగా కలెక్టరేట్ ప్రాంగణంలో అత్యధికంగా 22 శాఖల కార్యాలయాలు నడుస్తున్నాయి. మిగతా శాఖల కార్యాలయూలు నగరంలోనేవేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో సంబంధిత సేవలు పొందడం ప్రజలకు కష్టంగా మారింది. ఒకచోటు నుంచి మరో చోటుకు పదేపదే ఆటోలలో వెళ్లాల్సి రావడం ఖర్చుతో కూడుకున్న పనికావడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న అన్ని కార్యాలయూలను ఒకేచోట నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అవసరమైన భవనాలు నిర్మించేందుకు స్థానిక ఆదివారపుపేటలోని ఏఎస్ఆర్ స్టేడియం సమీపంలో రెండున్నర ఎకరాల భూమిని కేటాయించారు. ఇక్కడ ఇప్పటికే దాదాపు రూ.3 కోట్లతో ఐటీడీఏ ట్రైనింగ్ సెంటర్, విద్యార్థుల వసతి భవనాల నిర్మాణం ప్రారంభించారు.
మరికొన్ని భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి ఐటీడీఏ కార్యాలయాలు, వసతి గృహాలు కోటరామచంద్రపురంలో ఉన్నాయి. వాటిని జిల్లా కేంద్రంలో అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. జేవీఆర్ నగర్లో ఉన్న సెంట్రల్ ఇంటెలిజెన్స్, ఏఎస్ఆర్ స్టేడియం వద్ద ఉన్న ఆర్మీ హాస్పిటల్, ఎన్ఆర్ పేటలో ఉన్న ఐసీడీఎస్ అర్బన్ కార్యాలయం, టూటౌన్ పోలీస్‌స్టేషన్ ఎదురు రోడ్డులో ఉన్న కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్, బాలయోగి పార్క్‌లో ఉన్న బీసీ స్టడీ సర్కిల్‌ను కొత్తగా నిర్మించే భవనాల్లోకి మార్చనున్నారు. ఇదే ప్రాంతంలో ఏఎస్ఆర్ స్టేడియం పునర్నిర్మాణ పనులు జరుగుతున్నారుు. ప్రభుత్వ కార్యాలయాలు సైతం ఇక్కడికి సమీపంలో కేంద్రీకృతం కానున్నాయి.