Assailants attack
-
ప్రముఖ టీవీ ఛానల్లో ఆయుధాలతో వ్యక్తి హల్చల్
చెన్నె: ప్రముఖ టీవీ ఛానల్ కార్యాలయంలోకి దూరి ఓ వ్యక్తి ఆయుధాలతో హల్చల్ చేశాడు. కత్తి డాలు పట్టుకుని నానా హంగామా సృష్టించాడు. కార్యాలయంలో అద్దాలు, ఫోన్లు, కంప్యూటర్లు ధ్వంసం చేశాడు. దీంతోపాటు సిబ్బందిని పచ్చిబూతులు తిడుతూ బీభత్సం చేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నెలో చోటుచేసుకుంది. తమిళనాడులో ప్రముఖ ఛానల్ సత్యం టీవీ. రోయపురం కామరాజరర్ రోడ్డులో ఉన్న కార్యాలయంలోకి మంగళవారం సాయంత్రం 6-7 గంటల సమయాన అకస్మాత్తుగా ఓ దుండగుడు వచ్చాడు. కత్తి, డాలు చేతపట్టి కార్యాలయంలోని రిసెప్షన్లో కనిపించిన వాటినన్నింటిని ధ్వంసం చేశాడు. ఫోన్లు, అద్దాలు, కంప్యూటర్లు పగులగొట్టాడు. ఒకటో అంతస్తులోని అకౌంట్స్ డిపార్ట్మెంట్లో హల్చల్ చేశాడు. ఆ దుండగుడు కోయంబత్తూరుకు చెందిన డి.శివకుమార్‌గా గుర్తించారు. దుండగుడి దాడిలో ధ్వంసమైన కార్యాలయంలో సామగ్రి అర్ధగంటపాటు బీభత్సం సృష్టించడంతో ఉద్యోగులంతా భయాందోళనకు గురయ్యారు. అతడిని అతికష్టంగా సెక్యూరిటీ బంధించింది. సమాచారం అందుకున్న రోయపురం పోలీసులు కార్యాలయానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో ఆ కార్యాలయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడిపై సత్యం టీవీ ఎండీ ఇసాక్ లివింగ్స్టన్ స్పందించారు. ‘అతడు ఎవరో తెలియదు. ఎందుకు దాడి చేశాడో కూడా లేదు. మేం ఎవరికీ వ్యక్తిగతంగా విరుద్ధ ప్రసారాలు చేయలేదు.’ అని తెలిపారు. ఈ దాడికి సంబంధించిన సీసీ ఫుటేజీని ఆ ఛానల్ విడుదల చేసింది. శివ కుమార్ కోయంబత్తూర్ నుంచి గుజరాత్‌కు వెళ్లాడు. నిందితుడు గుజరాత్ నంబర్ ప్లేటు ఉన్న కారుతోనే వచ్చాడు. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారణ చేపట్టారు. కార్యాలయంపై దాడిని జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. జర్నలిస్టులు, మీడియా కార్యాలయాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా చెన్నె ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శి భారతి తమిళన్ డిమాండ్ చేశారు. -
మహిళ మెడ నరికి హత్య
హయత్‌నగర్: దుండగులు ఓ మహిళ మెడ నరికి దారుణంగా హత్యచేశారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుంట్లూర్‌లో ఈ ఘటన బుధవారం వెలుగుచూసింది. కుంట్లూర్ శివారులో నాగోలు వెళ్లే దారిపక్కన దుర్వాసన వస్తుండటంతో పశువుల కాపరులు గమనించగా ఓ మహిళ మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గుర్తు తెలియని దుండగులు మహిళ మెడ నరికి చంపినట్లు గుర్తించారు. ఘటనా స్థలంలోని ఆధారాలను బట్టి మృతురాలిని మెదక్ జిల్లా జోగిపేట మండలం యారారం గ్రామానికి చెందిన బేతమ్మ అలియాస్ లింగమ్మగా, ఆమె వయసు 45–50 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. దుండగులు రెండు రోజుల కిందట హత్య చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహం వద్ద సెల్‌ఫోన్, డైరీలు, మద్యం సీసాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. క్లూస్‌టీం సిబ్బంది వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యక్తిపై గుర్తు తెలియని దుండగుల దాడి
అశ్వారావుపేట(ఖమ్మం): ఖమ్మం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో గుర్తు తెలియని దుండగులు ఒక వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహం వీధిలో ఉండే ఎం.మల్లికార్జునరావు గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నారు. ఆవరణలో తన వాహనాన్ని పార్క్ చేసి ఇంట్లోకి ప్రవేశించే సమయంలో ముగ్గురు ఆగంతకులు ఆయనపై కర్రలు, రాడ్లతో దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. దానిని గమనించిన కుటుంబసభ్యులు కేకలు వేయటంతో దుండగులు పరారయ్యారు. కాగా, ఈ దాడి దొంగల పనే అయి ఉంటుందని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
సంగారెడ్డి కౌన్సిలర్‌పై దుండగుల దాడి
మెదక్: జిల్లాలో సంగారెడ్డి 20వ వార్డు కౌన్సిలర్ ప్రదీప్‌పై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ప్రదీప్ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఆయన పరిస్థితి విషమించడంతో అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.