బడ్జెట్ ఫలితాలిచ్చేదిగా లేదు
బీసీ సంక్షేమాన్ని మరిచారు
మండలిలో డీఎస్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఫలితాలిచ్చేదిగా కనిపించడం లేదని, బడ్జెట్ ప్రతుల్లో పేర్కొన్న అంకెల్లో స్పష్టత లోపించిందని శాసన మండలిలో ప్రతిపక్షనేత డి.శ్రీనివాస్ సర్కారుపై ధ్వజమెత్తారు. శనివారం మండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం అధిక జనాభా కలిగిన బలహీనవర్గాలను నిర్లక్ష్యం చేసినట్లు కనిపిస్తుందన్నారు. బీసీల సంక్షేమానికి అదనంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చాక తమకు ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఆశపడ్డారని, ప్రభుత్వం ఏర్పడి 9 నెలలైనా నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వారిని నిరాశకు గురిచేస్తుందని అన్నారు.
ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం వెంటనే నోటిఫికేన్లు ఇవ్వాలని, వయోపరిమితిని పదేళ్ల వరకు సడలించాలని ఆయన డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలో ఇప్పటికే 60నుంచి 70శాతం పనులు పూర్తయి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను కూడా చేపట్టాలన్నారు. హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్పంచుల గౌరవవేతనాన్ని పెంచే దిశగా ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తామని, పొరపాట్లు చేస్తే వ్యతిరేకి స్తామని స్పష్టం చేశారు.