డీఆర్సీ.. ఏమైనట్టు..?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: సంక్షేమాభివృద్ధి పథకాల అమలును సమీక్షించే నాథులే లేకపోవడం.. వివిధ శాఖల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోవడం.. అధికారుల్లో సమన్వయం కొరవడటంతో జిల్లా ప్రగతి తిరోగమిస్తోంది. టీడీపీ ప్రభుత్వం కొలువుదీరి ఐదు నెలలు కావస్తోన్నా ఇప్పటికీ జిల్లా అభివృద్ధిపై సమగ్రంగా సమీక్షించిన దాఖలాలు లేకపోవడమే అందుకు తార్కాణం. జిల్లా ప్రగతికి దిశానిర్దేశం చేసే డీఆర్సీలను ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడం.. ఇన్చార్జ్ మంత్రిని నియమించకపోవడం సంక్షేమాభివృద్ధి పథకాల అమలుపై తీవ్ర ప్రభావం చూపుతోందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.
సంక్షేమాభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలుచేయడం, సమస్యలను పరిష్కరించడం, అధికారులను సమన్వయం చేయడం కోసం జిల్లా సమీక్ష మండలి(డీఆర్సీ)ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం రివాజు. డీఆర్సీ చైర్మన్ హోదాలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి ప్రతి మూణ్ణెళ్లకు ఒకసారి సమావేశాలు నిర్వహించి.. అధికారులకు దిశానిర్దేశం చేస్తే ప్రగతిపథంలో దూసుకెళ్లవచ్చునన్నది ప్రభుత్వ భావన. 1995-2004 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ.. 2004-2014 వరకూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు డీఆర్సీలను ఏర్పాటు చేయడమే అందుకు తార్కాణం.
టీడీపీ ప్రభుత్వం కొలువుదీరి నేటికి ఐదు నెలలు పూర్తికావస్తోన్నా ఇప్పటికీ డీఆర్సీల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోలేదు. కనీసం జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిని కూడా నియమించలేదు. ఏసీడీపీ(అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి పథకం) కింద శాసనసభ స్థానానికి ఏడాది రూ.కోటి కేటాయిస్తారు. ఇందులో రూ.50 లక్షల విలువైన పనులను ఎమ్మెల్యే, రూ.50 లక్షల విలువైన పనులను ఇన్చార్జ్ మంత్రి ప్రతిపాదిస్తారు.
చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో నియోజకవర్గానికి ఆర్పీహెచ్ పథకం కింద ఏటా కేటాయించే 1000 ఇళ్లల్లో 500 గృహాలకు ఎమ్మెల్యే, తక్కిన 500 ఇళ్లకు ఇన్చార్జ్ మంత్రి లబ్ధిదారులను ఎంపి చేసేవారు. కానీ ఇప్పటికీ ఏసీడీపీ, ఆర్పీహెచ్ల కింద నిధులను మంజూరు చేయలేదు. ఇన్చార్జ్ మంత్రి డీఆర్సీకి ఛైర్మన్‌గానూ.. కలెక్టర్ సభ్య కార్యదర్శిగానూ వ్యవహరిస్తారు. డీఆర్సీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్, డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మన్లు సభ్యులుగా ఉంటారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే డీఆర్సీ సమావేశాలకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్లతోపాటూ వివిధ శాఖల ఉన్నతాధిరులు అందరూ విధిగా హాజరుకావాలి.
ఈ సమావేశాల్లో సంక్షేమాభివృద్ధి పథకాల అమలును సమీక్షించి.. అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. మినీ అసెంబ్లీగా పరిగణించే డీఆర్సీ సమావేశాలు వివిధ శాఖల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకుని.. ప్రభుత్వం ఆమోదముద్ర వేసేలా చూస్తుంది. ఇది సంక్షేమాభివృద్ధి పథకాల అమలును వేగవంతం చేసేది. కానీ ఇప్పుడు డీఆర్సీ సమావేశాలు నిర్వహించకపోవడంతో సంక్షేమాభివృద్ధి పథకాలను సమీక్షించలేని దుస్థితి నెలకొంది.
అధికారుల మధ్య సమన్వయంలోపించడంతో సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయాయి.పరిపాలన అస్తవ్యస్తంగా మారడం, సంక్షేమాభివృద్ధి పథకాల అమలు పడకేయడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తాగునీటి ఎద్దడిని నివారించడంలోనూ.. ఉపాధిహామీ పథకాన్ని చేపట్టి వలసలను నిరోధించడంలోనూ, గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులను చెల్లించడంలోనూ అధికారులు విఫలమవుతోండటమే అందుకు నిలువెత్తు నిదర్శనం.