అసెంబ్లీ వీడియోలు ఎలా బయటపెడతారు: రోజా
అసెంబ్లీ సమావేశాలలోని కొన్ని దృశ్యాలను సీడీల ద్వారా విడుదల చేయడంపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. దీనిపై ఆమె శాసనసభ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. ఎంపిక చేసిన విజువల్స్ మాత్రమే ఎందుకు విడుదల చేశారని ఆమె అడిగారు. తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన సీడీలలో దృశ్యాలను వారికి ఎవరు ఇచ్చారో తెలపాలని డిమాండ్ చేశారు. వీడియోలను అనధికారికంగా పొందారా.. లేక ఏబీఎన్ ఛానల్ వారికి ఇచ్చిందా అని అనుమానం వ్యక్తం చేశారు. అసెంబ్లీ దృశ్యాలను ఎన్టీఆర్ ట్రస్టు భవన్, టీడీఎల్పీ ఆఫీసులో ఎలా విడుదల చేస్తారని, దీనికి స్పీకర్ అనుమతి ఉందా లేదా అని ప్రశ్నించారు.
అసెంబ్లీ సాక్షిగా మమ్మల్ని పాతరేస్తామన్న బోండా ఉమామహేశ్వరరావు, నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న బుచ్చయ్య చౌదరిలపై స్పీకర్ కు సభాహక్కుల నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. మంత్రి పీతల సుజాత వడ్డాణం తీసుకున్న వార్త దక్కన్ క్రానికల్ పత్రికలో వచ్చిందని సంబంధిత రుజువుల్ని మీడియాకు చూపించారు. బాబు నాకు భిక్షపెట్టారని 'మంత్రి సుజాత అంటున్నారు కానీ ఎన్టీఆర్ భిక్ష పెట్టకుంటే చంద్రబాబు సీఎం అయ్యేవారేనా?' అని రోజా ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, పుష్ప శ్రీవాణి కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.