నేనెప్పుడూ వెల్లోకి వెళ్లలేదు: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తన రాజకీయ జీవితంలో ఎన్నడూ శాసనసభ వెల్లోకి వెళ్లి నిరసన తెలపలేదని శాసనసభలో ప్రతిపక్షనేత కె.జానారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు శాసనసభ సంప్రదాయాలు, మర్యాదలను పాటిస్తూ వచ్చానని పేర్కొన్నారు. గురువారం ఆయన అసెంబ్లీ లాబీలో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలయ్యేలా ఒత్తిడి తేవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. సభా మర్యాదలకు లోబడే ఆయా కార్యక్రమాలను చేపడతామని స్పష్టంచేశారు. శాసనసభ ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, విపక్ష నేత చంద్రబాబు సభలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునే వారని, మధ్యలో టీఆర్ఎస్ నేతలు వాళ్లిద్దరిపై విమర్శలు చేసేవారని ఆరోపించారు. తాము మాత్రం రాజకీయ విమర్శల జోలికి పోకుండా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని జానారెడ్డి తెలిపారు.