నెలాఖర్లోగా ఆస్తుల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: పరిమితికి మించి దేశ, విదేశీ విరాళాలు స్వీకరించే స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు తమ ఆస్తులు, అప్పులను జూలై నెలాఖరులోగా వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పూర్తిగా లేదా పాక్షికంగా ప్రభుత్వ నిధులు, వార్షిక ఆదాయం కోటి రూపాయలు దాటిన సొసైటీ, సంఘం, ట్రస్టు లాంటి వాటికి చెందిన డెరైక్టర్, మేనేజర్, కార్యదర్శి లేదా ఇతర అధికారులు ఆస్తుల వివరాలను సమర్పించాలని కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి చెప్పారు.
ఏ కేంద్ర ప్రభుత్వ శాఖ నుంచి వారు నిధులు తీసుకుంటున్నారో ఆ శాఖకు వారు వివరాలు ఇవ్వాలని, అలాగే విదేశాల నుంచి రూ. 10 లక్షలకు పైగా విరాళాలు తీసుకునే సంస్థలు హోం మంత్రిత్వ శాఖకు రిటర్న్స్ ఇవ్వాలని ఆ అధికారి పేర్కొన్నారు. స్వచ్ఛంద సంస్థ ఆఫీసు బేరర్లను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం, లోక్పాల్ చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఆస్తుల వివరాలు తప్పనిసరిగా వెల్లడించాలన్న నిబంధన మేరకు కేంద్రం ఈ ఆదేశాలు జారీచేసింది.