ఎక్సైజ్ ఏసీ సోదరుడి ఇంట్లో ఏసీబీ సోదాలు
ఏలూరు అర్బన్ : చాగల్లు మద్యం డిపోలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న ఎం.ఆదిశేషుపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో స్థానిక బడేటివారి వీధిలో నివాసముంటున్న ఆయన సోదరుడు మామిళ్లపల్లి పార్థసారథి ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు చేశారు. ఆదిశేషు చాగల్లు డిపోలో బాధ్యతలు స్వీకరించక ముందు గుంటూరులో పనిచేసేవారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి.
దీంతో సుమారు 8 నెలలుగా ఆయన కుంటుంబం, బంధువులు, స్నేహితులపై ప్రత్యేక నిఘా ఉంచిన ఏసీబీ సెంట్రల్ సెల్ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ప్రాంతాల్లో ఆయన బినామీలుగా భావిస్తున్న వారి ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. భీమడోలు మండలం గుండుగొలనుకు చెందిన ఆదిశేషు బంధువులు ఏలూరులో నివాసం ఉన్నారని గుర్తించిన అధికారులు పార్థసారథి ఇంట్లో సోదాలు చేశారు. నిందితునికి బినామీగా భావిస్తున్న ఆయన ఇంట్లో స్థిరాస్థులకు సంబంధించిన దస్తావేజులు, నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది.
చాగల్లు డిపోలోనూ..
చాగల్లు: చాగల్లులోని మద్యం డిపోలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఒంగోలు ఏసీబీ సీఐ ప్రతాప్ ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజాము వచ్చిన బందం మధ్యాహ్నం రెండు గంటల వరకు సోదాలు చేసింది. విజయవాడలో నివసిస్తున్న అదిశేషు ఇంట్లో, అతని బందువులు ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. చాగల్లు డిపోలో మధ్యం నిల్వలు, ఆయన కార్యాలయూన్ని ఏసీబీ అధికారులు క్షుణంగా తనిఖీ చేశారు. డిపో సిబ్బందిని, హమాలీలను బయటికి పంపించేశారు. సోదాలతో డిపో నుంచి మద్యం కేసులు డెలివరీ నిలిచిపోరుుంది. దీంతో మద్యం వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. సీఐ ప్రతాప్ మాట్లాడుతూ అదిశేషుకు విజయవాడలో ఆదాయానికి మించి ఆస్తులు ఉండటంతో అతనిపై కేసు నమోదైందని చెప్పారు. చాగల్లు డిపోలో చేసిన తనిఖీల్లో ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్స్ లభించలేదని చెప్పారు. అదిశేషు మూడు నెలల క్రితం బదిలీపై చాగల్లు డిపోకు వచ్చారు.