Associated Journals Limited
-
16 కోట్ల ఏజేఎల్ భవనం అటాచ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఆధ్వర్యంలోని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)కు చెందిన రూ.16.38 కోట్ల విలువైన భవనాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపిస్తూ ఏజేఎల్‌తోపాటు, ఆ సంస్థ సీఎండీ, కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ వోరాకు నోటీసులు జారీ చేసింది. ముంబైలోని అత్యంత ఖరీదైన బాంద్రా ఏరియాలోని తొమ్మిదంతస్తుల భవనంలోని కొంత భాగాన్ని అటాచ్ చేసినట్లు శనివారం ఈడీ తెలిపింది. గాంధీ కుటుంబసభ్యులతోపాటు కాంగ్రెస్ సీనియర్ నేతల ఆధ్వర్యంలోని ఏజేఎల్ గ్రూపు ఆ పార్టీకి చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రికను నిర్వహిస్తోంది.1992లో హరియాణా సీఎంగా ఉన్నపుడు కాంగ్రెస్ సీనియర్ నేత భూపీందర్ హూడా పంచ్‌కులలోని భూమిని తక్కువ ధరకే ఏజేఎల్‌కు కేటాయించి, అధికార దుర్వినియోగం, అవకతవకలకు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఆ భూమి వాస్తవ విలువ రూ.64.93 కోట్లు కాగా కేవలం రూ.59.39 లక్షలకే ఏజేఎల్‌కు అప్పగించారంటూ ఈడీ ఇప్పటికే ఆ భూమిని అటాచ్ చేసింది. ఈ కేసులో హూడా, వోరాలను ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి 2018లో మోతీలాల్ వోరా, భూపీందర్ హూడాపై పంచ్‌కుల కోర్టులో చార్జిషీటు వేసింది. -
‘నేషనల్ హెరాల్డ్’ ఖాళీ చేయాల్సిందే..!
సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ వార్తా సంస్థకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సెంట్రల్ ఢిల్లీలోని ఆఫీస్‌ను ఖాళీ చేయాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. హైకోర్టు డిసెంబరులో ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అసోషియేట్ జర్నల్స్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం కొట్టివేసింది. దేశ రాజధాని ప్రాంతంలో గల ఢిలీ-ఐటీవో భవనంలో హెరాల్డ్ సంస్థ గత 56 ఏళ్లుగా కొనసాగుతోంది. కాగా, ఐటీవో ప్రాంతంలో ఎలాంటి వార్తా సంస్థలు కొనసాగరాదంటూ కేంద్రం గతంలోనే కోర్టుకు విన్నవించింది. గత పదేళ్లుగా ఐటీవో ప్రాంతంలో వార్తా సంస్థల నిర్వహణకు అనుమతివ్వడం లేదని తెలిపింది. 56 ఏళ్ల క్రితం అసోషియేట్ జర్నల్స్ లిమిటెడ్‌కు ఇచ్చిన లీజును ఈ మేరకు కేంద్రం రద్దు చేసింది. దీంతో ఐటీవో భవనంలో కొనసాగుతున్న నేషనల్ హెరాల్డ్ ఆఫీస్‌ను ఖాళీ చేయాలని డిసెంబరులో కోర్టు ఉత్తర్వులిచ్చింది. -
స్వచ్ఛంద సంస్థగా ఏజేఎల్
లక్నో: కోర్టు కేసులను ఎదుర్కొంటున్న నేషనల్ హెరాల్డ్ దినపత్రిక యాజమాన్య సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్).. ఇకపై వాణిజ్య సంస్థ కాదు. అది ఇక స్వచ్ఛంద సంస్థ. చాలా కాలం కిందట నిలిచిపోయిన వార్తా పత్రికల ప్రచురణను పునఃప్రారంభించాలని కూడా ఆ సంస్థ భాగస్వాములు నిర్ణయించారు. గురువారం లక్నోలో ఏజేఎల్ భాగస్వాముల అసాధారణ సర్వసభ్య సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కంపెనీల చట్టం 2013 కింద.. లాభార్జన కోసం కాని సెక్షన్ 8 సంస్థగా మార్చేందుకు ఉద్దేశించిన పలు ప్రతిపాదనలను వాటాదారులు పరిశీలించి ఆమోదించారని ఏజేఎల్ మేనేజింగ్ డెరైక్టర్ మోతీలాల్ ఓరా విలేకరులకు తెలిపారు. మూడు గంటలకు పైగా కొనసాగిన భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంస్థ ప్రచురణలను కూడా పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏజేఎల్ భాగస్వాములైన కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీలు కూడా పరోక్షంగా తమ ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. ఏజేఎల్‌ను 2010లో యంగ్ ఇండియన్ కంపెనీకి అప్పగించటంలో అవినీతి చోటు చేసుకుందంటూ.. సోనియా, ఆమె కుమారుడు రాహుల్ లతో పాటు మరో ఐదుగురిపై బీజేపీ నేత సుబ్రమణ్యంస్వామి క్రిమినల్ కేసు దాఖలు చేయటం, ఢిల్లీ కోర్టు వారికి సమన్లు జారీ చేయటం, వారు కోర్టుకు హాజరవ్వాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పటం, వారు గత నెలలో కోర్టుకు హాజరవటం.. ఈ కేసుపై రాజకీయ దుమారం రేగటం తెలిసిందే. ఏజేఎల్‌ను స్వచ్ఛంద సంస్థగా మార్చిన నిర్ణయాల ప్రభావం కేసుపై ఎలా ఉంటుందని విలేకరులు ప్రశ్నించగా.. కేసు కోర్టులో ఉందని, తమ నిర్ణయాల ప్రభావం కేసుపై ఉండబోదని ఓరా బదులిచ్చారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, శ్యాంపిట్రోడా, ఆస్కార్ ఫెర్నాండెజ్, షీలాదీక్షిత్, సలీమ్షేర్వాణి, రత్నాసింగ్, జితిన్‌ప్రసాద, సయ్యద్సిబ్తేరజీ తదితరులు హాజరయ్యారు. -
స్వచ్ఛంద సంస్థగా మార్చుదాం...
లక్నో: ఒకవైపు తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న కేసు నడుస్తుండగా.. నేషనల్ హెరాల్డ్ యాజమాన్య సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అసాధారణ రీతిలో వచ్చే నెల (జనవరి) 21వ తేదీన సర్వసభ్య సమావేశం నిర్వహించనుంది. సంస్థ నిర్మాణాన్ని వాణిజ్యం నుంచి లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థగా మార్చేందుకు 762 మంది వాటాదారుల అంగీకారం కోరుతూ లక్నోలో ఈ భేటీని ఏర్పాటు చేస్తోంది. అలాగే సంస్థ పేరును మార్చేందుకు కూడా వాటాదారుల సమ్మతి కోరనుంది. ఈ మేరకు అసోసియేటెడ్ జర్నల్స్ మేనేజింగ్ డెరైక్టర్ మోతీలాల్వోరా పేరుతో శనివారం లక్నోలోని దినపత్రికల్లో నోటీసును ప్రచురించింది.