చేతికి నల్లరిబ్బన్లతో జూడాల వినూత్న నిరసన
సీనియర్ రెసిడెంట్లూ సమ్మెలోకి
విజయవాడ : గ్రామీణ సర్వీసు పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం. 107ను రద్దు చేయాలని, ఆ సర్వీసును కంపల్ సరీగా కాకుండా వలంటరీ సర్వీసుగా మార్పుచేయాలని డిమాండ్ చేస్తూ జూడాలు చేస్తున్న సమ్మె మూడో రోజూ కొనసాగింది. సోమవారం జూడాలు సిద్ధార్థ వైద్య కళాశాల నుంచి రెండు చేతులకు సంకెళ్లలా నల్లరిబ్బన్లు కట్టుకుని వినూత్న రీతిలో ర్యాలీ నిర్వహించారు. జీవో రద్దులో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకునే వరకూ సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పారు.
ఉత్తర్వులను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికే ఉందని, కోర్టు తీర్పు ప్రకారం నిర్ణయం తీసుకుందామని చెప్పడం సమంజసం కాదన్నారు. స్పందించకుంటే అత్యవసర సేవలను సైతం బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు. రెండు రోజుల పాటు పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యార్థులు, హౌస్సర్జన్లు మాత్రమే విధులు బహిష్కరించగా, సోమవారం నుంచి కంపల్ సరీ సర్వీసు చేస్తున్న సీనియర్ రెసిడెంట్లు కూడా సమ్మెలో పాల్గొన్నారు. దీంతో వార్డుల్లో రోగులకు సేవలందించడం కష్టతరంగా మారింది
నేడు స్వచ్ఛ భారత్
జూడాల సమ్మెలో భాగంగా మంగళవారం ప్రభుత్వాస్పత్రి ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ తనూజ్ తెలిపారు.