ఆ నటులందరికీ భద్రత కల్పిస్తాం
ముంబై: పాకిస్థాన్‌కు చెందిన సినీ, టీవీ నటులు రెండు రోజుల్లోపు దేశం విడిచి వెళ్లిపోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఎంఎన్ఎస్ అల్టిమేటం జారీచేయడంపై మహారాష్ట్ర పోలీసులు స్పందించారు. భారత ప్రభుత్వం అనుమతితో వచ్చిన పాక్ సహా విదేశాలకు చెందిన నటీనటులందరికీ రక్షణ కల్పిస్తామని, ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. వాళ్లకు అవసరమైన భద్రత ఏర్పాటు చేస్తామని ముంబై జాయింట్ పోలీస్ కమిషనర్ దేవెన్ భారతి చెప్పారు.
పోలీసుల ప్రకటన అనంతరం ఎంఎన్ఎస్ ఉపాధ్యక్షురాలు షాలిని థాక్రే స్పందిస్తూ.. పాక్ నటులు నటిస్తున్న సినిమాలు, టీవీ సీరియళ్ల షూటింగ్‌లను తమ కార్యకర్తలు అడ్డుకుంటారని హెచ్చరించారు. పాక్ నటులను ప్రోత్సహిస్తున్న కరణ్ జోహార్ వంటి నిర్మాతలను నేరుగా హెచ్చరిస్తున్నామని, పాక్ నటులకు అవకాశాలు ఇవ్వరాదని అన్నారు. పాక్ నటులకు కౌంట్ డౌన్ మొదలైందని, వాళ్లు దేశం విడిచివెళ్లకుంటే వెంటాడి తరిమేస్తామని ఎంఎన్ఎస్ నాయకులు హెచ్చరించారు.