డిసెంబర్ కు అష్టాదశ పురాణాల అనువాదం
యూనివర్సిటీ క్యాంపస్: అష్టాదశ పురాణాల అనువాద ప్రక్రియను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని టీటీడీ ఈవో సాంబశివరావు పండితులను కోరారు. తిరుపతి శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో రెండు రోజుల పాటు జరిగిన పండిత పరిషత్ సమావేశం శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీటీడీ ఈవో సాంబశివరావు మాట్లాడుతూ... అష్టాదశ పురాణాల్లో 3.70 లక్షల శ్లోకాలు ఉండగా ఇప్పటి వరకు 2.57 లక్షల శ్లోకాల అనువాదం పూర్తయిందని... మిగిలిన అనువాదం కూడా పూర్తి చేసి డిసెంబర్ నాటికి ముద్రించాలని సూచించారు. అలాగే, వ్యాస భారతం, వాల్మీకి రామాయణం గ్రంథాల ప్రచురణ పూర్తికావచ్చిందన్నారు. పబ్లికేషన్ ద్వారా భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి ఎన్.ముక్తేశ్వరరావు ప్రసంగిస్తూ... అష్టాదశ పురాణాలను ఒక్కో పురాణాన్ని ఓ చిన్న పుస్తకం రూపంలో భక్తులకు అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టు చెప్పారు.