10 రోజులు... రూ. 509 కోట్లు
వరంగల్, న్యూస్‌లైన్ : సరిగ్గా 10 రోజులు... ఇవ్వాల్సిన పంట రుణం రూ.509 కోట్లు. నాలుగు నెలల నుంచి రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగి... తిరిగి అష్టకష్టాలు పడితెనే రూ.751 కోట్లు పంచిన బ్యాంకర్లు... కేవలం పది రోజుల్లో రూ.509 కోట్లు మంజూరు చేస్తారా...? ఇప్పుడు జిల్లా యంత్రాంగం ముందున్న అతిపెద్ద సవాల్ ఇది. రైతులకు ఇస్తామన్న పంట రుణాల భారీ లక్ష్యం కాగితాలకే పరిమితమవుతోంది. పెట్టుబడుల కోసం కాళ్లావేళ్లా పడుతున్నా... పట్టాదారు పాసుపుస్తకాలతో తిరుగుతున్నా... రైతులకు పంట రుణాలు అందడం లేదు. పెట్టుబడులకు చిల్లిగవ్వ లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇక కౌలు రైతులకు భరోసా అంటూ ప్రగల్భాలు పలికిన సర్కారు... వారికి రుణం ఇప్పించడాన్ని మరిచిపోయింది.
జిల్లాలో ఇదీ పరిస్థితి...
ఖరీఫ్‌లో మొత్తం రూ.1260 కోట్ల పంట రుణాలు ఇప్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక వేసింది. ఉన్నతాధికారులంతా కలిసి వార్షిక ప్ర ణాళికలో ఇది తమ పెద్ద విజయం అంటూ భు జాలు చరుచుకున్నారు. కానీ, అమల్లో మా త్రం పూర్తిగా మరిచిపోయారు. రైతుకు బ్యాం కర్లు పంట రుణాలు ఎలా ఇస్తున్నారు... ఏ మే రకు ఇచ్చారనే విషయాన్ని జిల్లా యంత్రాంగం పట్టించుకోలేదు. భారీ లక్ష్యం ముందుంచుకున్నారే గానీ రైతులకు రుణాలు సరిగా ఇప్పించలేక చతికిలబడ్డారు.
ఈసారి ఖరీఫ్ పంట రు ణాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తున్నామ ని అధికారులు చెబుతున్నారు. మొత్తం రూ.1260 కోట్ల రుణాలివ్వాల్సి ఉండగా... ఇప్పటి వరకు మంజూరు చేసింది రూ.751 కోట్లు మాత్రమే. జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది పెట్టుబడుల కోసం రుణాలపైనే అధారపడ్డా రు. వరుసగా రెండేళ్లు కరువు రావడంతో ఈ సారి ఖరీఫ్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. పెట్టుబడులకు బ్యాంకులపైనే ఆధారపడ్డారు. కానీ, సరైన సమయంలో బ్యాంకుల నుంచి అప్పు రాకపోవడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పలేదు. ఇక బ్యాంకులకు అప్పు కోసం వెళ్లిన రైతులు కాగితాలన్నీ చేతపట్టుకుని నెలల తరబడి తిరుగుతున్నారు.
ఇప్పటి వరకు సుమారు 2.60 లక్షల మందికి రుణాలి చ్చిన బ్యాంకర్లు... ఇంకా లక్షకుపైగా దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. అంతేకాకుండా దరఖాస్తులు పట్టుకుని తిరుగుతున్న రైతులు మరో 60 వేలు ఉంటారని వ్యవసాయాధికారు లు పేర్కొంటున్నారు. ఇప్పటికిప్పుడు రుణం మంజూరు చేయాల్సిన దరఖాస్తులు లక్షకుపైగా ఉన్నాయని అధికారులే చెబుతుండడం గమనార్హం. పంట రుణాల పంపిణీకి సంబం ధించి బ్యాంకర్లకు జిల్లా ఉన్నతాధికారులు కూడా కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఫలితంగా రుణ లక్ష్యం కాగితాలకే పరిమితమైంది. సెప్టెంబర్ 30 వరకే రుణాలిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఈసారి లక్ష్యం చేరడం కష్టమే. గత ఖరీఫ్‌లో కూడా జిల్లా వ్యాప్తంగా రైతాంగానికి రూ.875 కోట్ల రుణ లక్ష్యం ఉండగా... రూ.787 కోట్లే ఇచ్చారు.
కౌలురైతుకు కష్టమే..
జిల్లా వ్యాప్తంగా 13,813 మంది కౌలు రైతులు 30,440 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. వారికి రుణ అర్హత కార్డులను సైతం పంపిణీ చేశారు. కానీ... వీరిలో ఇప్పటివరకు 748 ఎకరాల్లో కౌలు చేస్తున్న 189 మంది కౌలు రైతులకు మాత్రమే సుమారు రూ. 55 లక్షలు రుణంగా మంజూరు చేశారు. మిగిలిన వారికి ఉత్తి చేతులు చూపిస్తున్నారు. వారి చేసుకున్న దరఖాస్తులన్నీ బ్యాంకర్ల వద్దే పడి ఉన్నాయి. అధికారులకు ఎన్నోసార్లు మొర పెట్టుకున్నా... ఒక్కరికి కూడా రుణం ఇవ్వడం లేదు. కాగా, రుణాలు ఇవ్వడంతో కొంత వెనకబడ్డామని... అయినా లక్ష్యం మేరకు రుణాలు ఇస్తామని లీడ్ బ్యాంకు మేనేజర్ దత్తు తెలిపారు. ఈ నెలాఖరు వరకే పంట రుణాలు మంజూరు చేస్తామని ఆయన చెప్పారు.
ఆదుకునే వారేరి ?
రైతులను ఆదుకునే వారే కరువయ్యారు. రెండు, మూడు నెలలుగా బ్యాంకుల చుట్టూ తిరిగినా... అప్పు ఇవ్వడం లేదు. వడ్డీ రాయితీ కోసం ముందస్తుగానే క్రాప్ లోన్ చెల్లించినా. ఇప్పటివరకు వడ్డీ రాలేదు. అదిరాకున్నా ఫర్వాలేదు కానీ... అసలు రుణాలు ఇవ్వడం లేదు. రైతులకు ఎకరానికి రూ. 50 వేల చొప్పున వడ్డీలేని రుణం అందించాలి
- మంజ మల్లేశం, రైతు, వీరన్నపేట (చేర్యాల)