దేశం సుస్థిరం... రాష్ర్టం మహోజ్వలం
అంజనం
దేశం సుస్థిరం... రాష్ర్టం మహోజ్వలం
2014లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతోందనీ, అన్ని రంగాలలోనూ రాష్ర్టం ప్రగతిపథంలో నడుస్తుందని
ఆస్ట్రో న్యూమరాలజీ చెబుతోంది.
రాష్ర్టంలో 2014లో బంజరు భూములు బంగారు భూములు అవుతాయి.
మహిళలకు ఉద్యోగ అవకాశాలు విస్తృతమౌతాయి.
సంఖ్యాశాస్త్రం ప్రకారం 2014 సంవత్సర సంఖ్య 7 వస్తుంది (2+0+1+4 = 7). ఇది కేతువుకి సంబంధించిన అంకె. అందు వల్ల 2014లో ప్రపంచవ్యాప్తంగా కేతుప్రభావంతో అందరూ ఆధ్యాత్మిక చింతన, త్యాగబుద్ధి కలిగి ఉంటారు. ప్రజలు, ప్రాంతాలు న్యాయసంబంధమైన చిక్కులు, ఆర్థిక ఇబ్బందులు, సంక్షోభాలు ఎదుర్కొనవలసి వస్తుంది. రాజకీయంగా తీవ్రమైన ఎత్తుపల్లాలు చోటుచేసుకుంటాయి.
2014 సంవత్సరంలో ‘2’ చంద్రునికి సంబంధించినది. చంద్రుని ప్రభావం వల్ల ప్రజలందరూ పరస్పరం ప్రేమాభిమానాలతో మెలుగుతారు. పరమత సహనం కనబరుస్తారు. ఇక ఇదే సంవత్సరంలో ఉండే ‘1’ వలన సూర్యప్రభావం ఉంటుంది. నాయకులు శక్తిమంతం అవుతారు. ఇందులోనే ఉండే ‘4’ రాహుసంఖ్య. దీనివలన ఆధునిక సాంకేతికతలో కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. 2014 సంవత్సర సంఖ్య ‘14’. ఇది బుధుడికి సంబంధించిన సంఖ్య. దీనివలన అందరికీ వ్యాపారవృద్ధి జరుగుతుంది. ప్రజలు ప్రత్యామ్నాయ ఔషధాలవైపు అంటే యోగా, మెడిటేషన్, ఆయుర్వేదం, ప్రాణిక్ హీలింగ్, రేఖి, చక్ర లాంటివాటిపట్ల మొగ్గు చూపుతారు.
అలాగే ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. సౌరశక్తిని ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. ప్రజలలో దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలలో కొత్త కట్టడాలు మొదలుపెడతారు. కొత్త పుణ్యక్షేత్రాలు పుట్టుకొస్తాయి. అంతేకాదు, దేశంలో ఆచార వ్యవహారాలకు ఆదరణ పెరుగుతుంది.
ఇండియా
ఇండియా పర్సనల్ ఇయర్ నం.3. అందువలన దేశం శాస్త్ర, సాంకేతిక రంగాలలో చాలా అభివృద్ధి చెందుతుంది. కొత్త సాంకేతిక రంగాలలో విద్యాసంస్థలు నెలకొల్పబడతాయి. మరోవైపు కొత్త వైరస్ వల్ల ప్రజల ఆరోగ్యం కుంటుపడే అవకాశం ఉంది. అందువలన వైద్యరంగంలో పరిశోధనలకు బడ్జెట్ కేటాయింపులు బాగా జరుగుతాయి. రాజకీయాలలో యువజనుల పాత్ర బాగా పెరుగుతుంది. మతాల మీద గౌరవమున్నవారికి అధికారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. గురు ప్రభావం వలన దేశంలో పంటలు బాగా పండుతాయి. ఖనిజాలు బాగా దొరుకుతాయి. బంగారం మీద ప్రజలకు ప్రీతి ఎక్కువగా ఉన్నప్పటికీ, బంగారం రేటు స్థిరంగా ఉంటుంది. మనం ఎంత స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ చైనా వల్ల ముప్పు ఏర్పడుతుంది.
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌కు పర్సనల్ ఇయర్ నం.1 అవటం వలన ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పార్టీలు అవిర్భవిస్తాయి. కొత్త కొత్త వ్యాపారాలు వస్తాయి. 2013తో పోలిస్తే 2014లో సామాజికంగా, ఆర్థికంగా దేశంలోనే మంచి అభివృద్ధి సాధిస్తుంది. అపారమైన భూ నిక్షిప్త ఖనిజ సంపదతో అగ్రస్థానంలో నిలబడుతుంది. బంజరు భూములు బంగారు భూములవుతాయి. కొత్త టెక్నాలజీని కనుగొనే సంస్థలు నెలకొల్పబడతాయి. మహిళలకు ఉద్యోగావకాశాలు విస్తృతమౌతాయి. వారి క్షేమం కోసం మరిన్ని చట్టాలు వస్తాయి. రాష్ట్రంలో పర్యాటక కేంద్రాలు పర్యాటకులతో కళకళలాడుతాయి.
పాలిటిక్స్
రాజకీయాల్లో కొత్తవారికి ప్రజల పట్టం కడతారు. పాలిటిక్స్ లోకి బాగా చదువుకున్నవారు, ఉన్నత పదవులు అలంకరించినవారు ఎక్కువగా వస్తారు. ప్రజలు ఎక్కువగా కొత్తవారికే పట్టం కడతారు. ఏపీలో కొత్త రాజకీయ కూటములు ఏర్పడతాయి. కొత్త కొత్త చట్టాలు వస్తాయి.
ఎడ్యుకేషన్
విద్యార్థులు కొత్త చదువులు చదువుతారు. సాంకేతిక విద్యకు ఆదరణ తగ్గుతుంది. ట్రెడిషనల్ వృత్తులపై ప్రజలలో మక్కువ ఏర్పడుతుంది. విద్యార్థులలో దైవభక్తి పెరుగుతుంది. చాలామంది వేదం చదవటానికి ఆసక్తి చూపుతారు. జ్యోతిష్యం లాంటి ప్రాచీన చదువులపై మక్కువ పెరుగుతుంది. నిరుద్యోగం తగ్గే అవకాశం ఉంది. వైద్యవిద్యపై విద్యార్థులలో మక్కువ పెరుగుతుంది. క్యాన్సర్ వ్యాధి నివారణకు నూతన వైద్యవిధానాలు ఆవిష్కరింపబడతాయి.
పరిశ్రమలు
రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా నానో టెక్నాలజీకి ఆదరణ పెరుగుతుంది. ఖనిజ సంపద పెరుగుతుంది. అందువలన ఖనిజాలను సంబంధించిన పరిశ్రమలు నెలకొల్పబడతాయి.
సినీ పరిశ్రమలో కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తారు. భారీ సినిమాలను నిర్మిస్తారు. సినీ పరిశ్రమకి మంచి అవకాశాలు వస్తాయి. ఈరంగంలో చాలామంది ఉపాధి అవకాశం ఏర్పడుతుంది.
టీవీ రంగంలో పనిచేసేవారికి ఆదరణ పెరుగుతుంది. ఈ రంగంలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. కొత్త కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తారు. పత్రికా రంగంలో మంచి ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త కొత్త పత్రికలు వస్తాయి.
వ్యవసాయం
ఈ సంవత్సరం పంటలు బాగా పండుతాయి. అదీకాక, రైతులు సంప్రదాయ పంటల కన్నా వాణిజ్య పంటలపై మక్కువ చూపుతారు. ప్రజలలో ఆహార అలవాట్లలో మార్పులు వస్తాయి. కొత్త గోశాలలు వెలుస్తాయి. గో పూజకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రజలు భూమి మీద మక్కువ చూపుతారు. బీడు భూములను పంట పొలాలుగా మారుస్తారు.
రియల్ ఎస్టేట్
ఆంధ్రప్రదేశ్ పర్సనల్ నం.1 కాబట్టి ప్రజలలో కొత్త నివాస గృహాలు కొనాలని కోరిక పెరుగుతుంది. అందువలన రియల్ ఎస్టేట్‌కి ఆదరణ పెరుగుతుంది. బీడు భూములలో సైతం కొత్త కొత్త విల్లాలు వెలుస్తాయి. నిర్మాణ రంగంలో పనిచేసే వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మొత్తంమీద ఆంధ్రప్రదేశ్‌కి 2014లో ఉజ్వల భవిష్యత్ ఉండి, అన్ని రంగాలలోను మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త కొత్త క్రీడాప్రాంగణాలు ఏర్పడతాయి. ట్రైనింగ్ ఫెసిలిటీస్ కూడా పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో క్రీడాకారులు మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తారు.
డా. మహమ్మద్ దావూద్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్
పర్సనల్ ఇయర్
పర్సనల్ ఇయర్ తెలుసు కోవాలంటే స్వాతంత్య్రదినాన్ని (15-8-1947) బర్త్‌డేగా తీసుకోవాలి. ఇప్పుడు పర్సనల్ నంబర్ తెలుసుకోవాలంటే ఇండియా జన్మదినం+నెల+ఏ సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలో ఆ సంవత్సరం తీసుకోవాలి. ఇప్పుడు 2014లో ఇండియా పర్సనల్ ఇయర్ ఈ విధంగా నిర్ణయించవచ్చు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తేదీ = 15
స్వాతంత్య్రం సిద్ధించిన నెల = 8
2014లోని 2, 0, 1, 4 యొక్క మూల్యం (2+0+1+4) = 7
ఇవి మొత్తం కలిపితే = 30
అంటే 2014లో ఇండియా పర్సనల్ ఇయర్ నం.3 అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ పర్సనల్ ఇయర్ తెలుసుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ అవతరించిన తేదీ+ నెల+ 2014 కలపాలి.
అనగా 1+11+2014 = 10 =1
ఈ పర్సనల్ ఇయర్‌ను బట్టి ఆ సంవత్సరంలో జరిగే పరిణామాలను తెలియజేయవచ్చు. ఇది న్యూమరాలజీ ప్రకారం భవిష్యత్తును తెలుసుకునే విధానం.