ఇస్రో సప్తపది
నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలోకి ‘ఆస్ట్రోశాట్’
శ్రీహరికోట(సూళ్లూరుపేట) : సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం... సోమవారం ఉదయం 10 గంటల సమయం. ఖగోళ పరిశోధనల కోసం ఇస్రో చేస్తున్న మొదటి ప్రయోగం... మిషన్ కంట్రోల్‌రూమ్‌లో అంతా నిశ్శబ్దం. కౌంట్‌డౌన్ పూర్తికాగానే క్షణాల్లో పీఎస్ఎల్వీ సీ30 రాకెట్ ఎరుపు, నారింజ రంగులతో నిప్పులు చిమ్ముకుంటూ నింగివైపునకు దూసుకెళ్లింది. దశలవారీగా విజయవంతంగా ప్రయాణిస్తూ ఉపగ్రహాలను నిర్ణీత సమయంలో కక్ష్యలో ప్రవేశపెట్టడంతో మిషన్ కంట్రోల్‌రూమ్‌లోని శాస్త్రవేత్తలందరిలో చిరునవ్వుతో కూడిన విజయగర్వం తొణికిసలాడింది.
సత్తాచాటిన పీఎస్ఎల్వీ...
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) వరసగా 30వ సారి విజయఢంకా మోగించింది. 1,513 కిలోల బరువు కలిగిన ఆస్ట్రోశాట్ ఉపగ్రహంతో పాటు మరో ఆరు విదేశీ ఉపగ్రహాలను భూమికి 650 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువకక్ష్య (సన్ సింక్రోనస్ ఆర్బిట్)లో విజయవంతంగా ప్రవేశపెట్టి ఇస్రో ‘కదనాశ్వం’ అంతరిక్ష వినువీధిలో సత్తా చాటింది. విశ్వంలోని సుదూర పదార్థాల అధ్యయనం చేయడం కోసం సుమారు 11 ఏళ్లు కష్టపడి రూపకల్పన చేసిన ఆస్ట్రోశాట్‌ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. 44.5 మీటర్ల ఎత్తున్న పీఎస్ఎల్వీ సీ30 రాకెట్ నాలుగు దశల్లోనూ విజయవంతం అయ్యింది. విదేశీ ఉపగ్రహాలనూ నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టింది.
రూ.178 కోట్ల వ్యయం..
1996లో అప్పటి ఇస్రో చైర్మన్ డాక్టర్ కస్తూరిరంగన్ విశ్వంలోని గ్రహాలు, వాటి నుంచి వెలువడే వ్యర్థాలు, నక్షత్రాల పుట్టుక, వాటికి అవతల వున్న స్థితిగతులు తెలుసుకోవడానికి ఒక ఉపగ్రహ ప్రయోగాన్ని చేయాలని ప్రతిపాదించారు. దీనికి 2004లో అనుమతి వచ్చింది. 2006 నుంచి ఈ ఉపగ్రహాన్ని రూపకల్పన చేశారు. ఈ పనిలో ఇస్రోతో పాటు వివిధ వర్సిటీల భాగస్వామ్యం కూడా ఉంది. ఈ ప్రయోగం ద్వారా ఇస్రోకు ఎలాంటి ఆదాయం ఉండదని, కేవలం విశ్వం గురించి రీసెర్చి చేసే పరిశోధకులకు మాత్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కె.సూర్యనారాయణశర్మ తెలిపారు. ఈ ఉపగ్రహం తయారీకి రూ.178 కోట్లు వ్యయం చేశారని తెలుస్తోంది. ఈ ఉపగ్రహం కక్ష్యలో ఐదేళ్లపాటు సేవలు అందిస్తుంది
వాణిజ్యపరమైన ప్రయోగాల్లో అర్ధసెంచరీ!
విదేశీ ఉపగ్రహాల ప్రయోగాల్లో ఇస్రో అర్ధసెంచరీ మార్కును దాటింది. 1999 మే 26న పీఎస్ఎల్వీ సీ2 ద్వారా జర్మనీకి చెందిన డీఎల్ఆర్-టబ్‌శాట్, రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు చెందిన కిట్‌శాట్-3లను పంపి వాణిజ్యపర ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. తాజాగా పీఎస్ఎల్వీ సీ30తో 20 దేశాలకు చెందిన 51 ఉపగ్రహాల ప్రయోగం పూర్తయ్యింది. అత్యధికంగా జర్మనీకి చెందిన పది ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది. కెనడా, సింగపూర్, జపాన్, డెన్మార్క్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, అల్జీరియా, ఇటలీ, సౌత్‌కొరియా, అర్జెంటీనా, ఇజ్రాయెల్, లక్సెంబర్గ్, టర్కీ, బెల్జియం, ఇండోనేసియా, నెదర్లాండ్స్, యూకే, అమెరికా దేశాలకు చెందిన వివిధ ఉపగ్రహాలను వినువీధిలోకి పంపించింది.
2016 ఆఖరు నాటికి సార్క్ ఉపగ్రహం...
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచన మేరకు సార్క్ దేశాల అవసరాల కోసం 2016 ఆఖరు నాటికి ప్రత్యేక ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నామని ఇస్రో చైర్మన్ పేర్కొన్నారు. పీఎస్ఎల్వీ సీ30 సక్సెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ... ఆస్ట్రోశాట్ నిర్దేశిత కక్ష్యలో ఉన్నట్టు బెంగళూరులోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం తెలిపిందన్నారు. ఈ ఉపగ్రహంలోని స్కై మానిటర్ నక్షత్రాల పుట్టుక, వాటికి అవతల వైపు జరిగే స్థితిగతులను అధ్యయనం చేస్తుందని చెప్పారు.
సమష్టి కృషితో విజయం: ఇస్రో చైర్మన్
ప్రయోగం విజయానంతరం ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ఈ ప్రయోగం సమష్టి విజయమన్నారు. ఆస్ట్రోశాట్ ప్రాజెక్ట్ డెరైక్టర్ కె.సూర్యనారాయణశర్మ మాట్లాడుతూ ఉపగ్రహాన్ని తయారుచేసిన విధానాన్ని వివరించారు. ప్రయోగానికి సారథ్యం వహించిన మిషన్ డెరైక్టర్ బి.జయకుమార్, వీఎస్ఎస్సీ డెరైక్టర్ డాక్టర్ కె.శివన్, ఎల్పీఎస్సీ డెరైక్టర్ ఎస్.సోమనాథ్, షార్ డెరైక్టర్ పి.కున్హికృష్ణన్, ఐసాక్ డెరైక్టర్ ఎం.అన్నాదురై, ఎన్ఆర్ఎస్సీ డెరైక్టర్ డాక్టర్ వీకే దడ్వాల్, శాక్ డెరైక్టర్ తపన్ మిశ్రా, మరో శాస్త్రవేత్త ఎస్.రాకేష్‌లు ప్రయోగంలో ఎదురైన ఇబ్బందులను, అధిగమించిన సవాళ్లను వివరించారు. ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్, సీనియర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ యశ్పాల్, కేంద్ర మంత్రి సుజనాచౌదరి మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రముఖుల ప్రశంసలు
ఆస్ట్రోశాట్ ప్రయోగం విజయవంతం కావ డంపై ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్ తదితరులు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.