అశ్వాపురంపాడులో డయేరియా
పినపాక, న్యూస్‌లైన్: వలస ఆదివాసీ గ్రామమైన అశ్వాపురంపాడులో ఆదివారం వలస గొత్తికోయలు డయేరియాతో 10 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కరకగూడెం పంచాయతీ మోతె గ్రామంలో నివసిస్తున్న వలస గొత్తికోయల గ్రామం అశ్వాపురంపాడులో తాగునీరు కలుషితం కావడంతో 10 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. మడకం రాజయ్య, మడకం ఐతమ్మ, కొవ్వాసీ సునీత, మడివి ఉంగయ్య, కొవ్వాసీ బాలకృష్ణ, కొవ్వాసీ నందయ్య తదితరులు అస్వస్థతు గురయ్యారు. దీంతో స్థానికులు వారిని 108 ద్వారా పినపాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో కొవ్వాసి నందయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పినపాక ప్రభుత్వం వైద్యాధికారి సుధీర్‌నాయక్ మాట్లాడుతూ కలుషిత నీరు తాగడం వల్లే వారు డయేరియాతో అస్వస్థతు గురయ్యారని అన్నారు.
వైద్య శిబిరం ఏర్పాటు చేయాలి : సీపీఎం
వలస గొత్తికోయాల గ్రామం అశ్వాపురంపాడులో ప్రభుత్వం వెంటనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి నిమ్మల వెంకన్న డిమాండ్ చేశారు. వారం రోజుల పాటు వైద్యులు శిబిరం నిర్వహించాలని ఆయన కోరారు. అదే విధంగా గ్రామంలో వలస గిరిజనులు తోగు నీరు తాగుతున్నారని, వారి కోసం బోరు ఏర్పాటు చేయాలని అన్నారు.