బన్నీకి అదే కరెక్ట్!
సందర్భం:సురేందర్ రెడ్డి బర్త్‌డే
అతనొక్కడే, అశోక్, అతిథి, కిక్, ఊసరవెల్లి చిత్రాలతో మాస్‌లోకి చొచ్చుకుపోయిన దర్శకుడు సురేందర్‌రెడ్డి.యాక్షన్ ఎంటర్టైనర్లను తెరకెక్కించడంలో బాగా నేర్పు కలిగిన ఆయన ప్రస్తుతం అల్లు అర్జున్‌ని ‘రేసుగుర్రం’గా తీర్చిదిద్దుతున్నారు. నేడు సురేందర్‌రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’ జరిపిన సంభాషణ.
2005లో ‘అతనొక్కడే’తో దర్శకుడయ్యారు. ఈ ఎనిమిదేళ్లలో ఆరు సినిమాలే చేయగలిగారెందుకని?
‘స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్’ అనే సిద్ధాంతాన్ని నేను బాగా నమ్ముతాను. ఒక సినిమా చేస్తున్నానంటే నేనందులో పూర్తిగా లీనమై పని చేస్తాను. ఆదరాబాదరాగా ఏ పనీ పూర్తి చేయడం నాకిష్టం ఉండదు. ఎక్కువ సినిమాలు చేస్తే ఎక్కువ డబ్బులొస్తాయి. కానీ నాకు ఆర్థిక సంతృప్తి కన్నా ఆత్మ సంతృప్తి ముఖ్యం.
మీరు క్రాంతికుమార్ శిష్యులు కదా. ఆయన తరహా సినిమాలు చేసే ఉద్దేశం ఉందా?
ఆయన తరహా అని కాదు కానీ, తక్కువ బడ్జెట్లో అంతా కొత్త తారలతో ఓ చిన్న సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. వచ్చే ఏడాది కచ్చితంగా చేస్తాను.
బన్నీతో మీరు చేస్తున్న సినిమాకు ‘రేసుగుర్రం’ టైటిల్ ఓకే చేశారా?
డబుల్ ఓకే. బన్నీ ఎనర్జీకి, ఈ కథకు ఆ టైటిల్ వందశాతం కరెక్ట్. అలాగని గుర్రపు పందాల నేపథ్యంలో సినిమా అనుకునేరు. ఇందులో బన్నీ పాత్ర ఫుల్ ఎనర్జిటిగ్గా ఉంటుంది. ఒకసారి లక్ష్యాన్ని ఫిక్స్ అయితే ఇక పక్క చూపులు ఉండని పాత్ర తనది. అందుకే ఈ టైటిల్ పెట్టాం.
బన్నీతో పనిచేయడం ఎలా ఉంది?
బన్నీ అంటేనే ఫుల్ ఎనర్జీకి ప్రతిరూపం. తనతో ఉంటే భయంకరమైన ఎంజాయ్మెంట్. తానో స్టార్‌ననే ఫీలింగ్ లేకుండా అందరితోనూ ఇట్టే కలిసిపోతాడు. ఎవరన్నా డల్‌గా కనిపిస్తే, అస్సలు క్షమించడు. వెంటనే వాళ్లల్లో ఎనర్జీ నింపేవరకూ వదలడు.
భోజ్‌పురి హీరో రవికిషన్‌తో ఇందులో విలన్‌గా చేయిస్తున్నారట?
అవును. ‘ఊసరవెల్లి’లోనే తనతో విలనీ చేయించాలనుకున్నా కుదర్లేదు. ‘రేసుగుర్రం’లో విలన్‌గా చాలామందిని అనుకున్నాం. చివరకు రవికిషన్ ఓకే అన్నారు. ఆయన చాలా ఇంట్రస్ట్ తీసుకుని పని చేస్తున్నారు. తెలుగు తెరకు ఓ మంచి విలన్ దొరికినట్టే.
ఇంతకూ ‘రేసుగుర్రం’ విశేషాలు చెప్పండి?
ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. రెండు పాటలు మినహా దాదాపుగా షూటింగ్ పూర్తయిపోయినట్టే. పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతోంది. రిలీజ్ ఎప్పుడనేది నిర్మాతలు నల్లమలుపు బుజ్జి, డా.కె.వెంకటేశ్వర్రావులు చెబుతారు.
బాలీవుడ్‌కి వెళ్లే ఉద్దేశం ఉందా?
హిందీలో సల్మాన్‌ఖాన్ హీరోగా ‘కిక్’ నేనే చేయాలి. ‘ఊసరవెల్లి’ బిజీలో ఉండి చేయలేకపోయాను. ఇంకొన్ని ఆఫర్లు వచ్చాయి. ఎప్పటికైనా హిందీ సినిమా చేస్తాను.
మీ నెక్ట్స్ కమిట్మెంట్స్?
కొత్తవాళ్లతో సినిమా అని చెప్పానుగా. అలాగే రవితేజతో ‘కిక్-2’ చేయాలి. స్క్రిప్టు రెడీగా ఉంది. అలాగే నితిన్‌తో ఓ సినిమా చేయాలి.
మీ డ్రీమ్ ప్రాజెక్ట్?
నా మనసులో ఒక ఆలోచన ఉంది. చాలా బిగ్ ప్రాజెక్ట్ అది. కార్యరూపం దాల్చడానికి చాలా కాలం పడుతుంది.