ఆసరా కరువు
ఆసరా కరువు
ఆత్మకూరురూరల్,
ప్రతినెలా వికలాంగులు, వితంతువులకు, వృద్ధులకు అందించే పింఛన్ల పంపిణీలో గోల్మాల్ చోటుచేసుకుంది. మూడు నెలలుగా పింఛన్లు ఇవ్వకపోవడంతో పలువురు పింఛన్‌దారులు తమ పింఛన్లు తొలగించారంటూ ఆందోళన చెందుతున్నారు. దీంతో అధికారులు మాత్రం వచ్చే నెలలో మూడు నెలలకు సంబంధించిన పింఛన్లు అందజేస్తామంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఆత్మకూరు మండలంలోని ఆయా ప్రాంతాల్లో వెలుగు చూస్తున్నాయి. వృద్ధుల, వితంతువుల, వికలాంగులకు ఆసరాగా ఉండేందుకు ప్రభుత్వం పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆత్మకూరు మండలంలో ఎనిమిది వేలకు పైగా వృద్ధాప్య, వితంతు, వికలాంగ, అభయహస్తం పింఛన్లున్నాయి. అయితే ప్రతినెలా ప్రతి ఒక్కరికి పింఛన్ డబ్బులు అందేవి. కానీ గత రెండు నెలలుగా కొందరికి పింఛన్లు రాలేదు. అధికారులు మాత్రం మూడు నెలలకు సంబంధించిన పింఛన్ డబ్బులు ఒకేసారి వస్తాయంటూ చెప్పడంతో వారు తిరిగి ఈనెలలో కూడా పింఛన్ డబ్బుల కోసం వచ్చారు. అందులో కురుకుందలో 172, ఆత్మకూరులో 192, సిద్దాపురంలో 30 పింఛన్లు రాలేదంటూ అధికారులు వెల్లడించడంతో ఆందోళన చెందిన పింఛన్‌దారులు తమ పింఛన్లను కావాలనే తొలగించారంటూ అధికారులను నిలదీసే ప్రయత్నం చేశారు. అధికారులు మాత్రం రేషన్‌కార్డు, ఆధార్‌కార్డులు ఇవ్వకపోవడంతో పాటు టెంపరర్లీ మైక్రేషన్కు బదులు పీఎంను అందులో వినియోగించడం ద్వారా కొన్ని పింఛన్లు ఎగిరిపోయినట్లు తెలి పారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ విధంగా జరిగిందని అం దరికీ పింఛన్లు వస్తాయంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా పింఛన్ల తొలగింపులో రాజకీయ నేతల జోక్యం ఉన్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఒక నెల రాకున్నా రెండవ నెలలోనైనా డబ్బులు చెల్లించేవారని, ప్రస్తు తం మూడు నెలలు కావస్తున్నా డబ్బులు చెల్లించకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందువల్ల సంబంధిత అధికారులు స్పందించి నిలిపివేసిన పింఛన్లకు వెంటనే డబ్బులు చెల్లించి ఆదుకోవాలని పింఛన్‌దారులు కోరుతున్నారు.