వికలాంగులకు కృత్రిమ పరికరాలు
ఆదిలాబాద్ రిమ్స్, న్యూస్‌లైన్ : జిల్లాలోని వికలాంగులకు ఉచితంగా కృత్రిమ పరికరాలు అందజేయడానికి లయన్స్‌క్లబ్ ముందుకొచ్చింది. బుధవారం ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో వికలాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించింది. జిల్లాల నలుమూలల నుంచి 500 మంది వికలాంగులు వచ్చారు. 250 మందిని పరీక్షించి పరికరాలకు ఎంపిక చేశారు. లయన్స్‌క్లబ్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ చౌదరి మాట్లాడుతూ ఆర్టిఫీషియల్ లింబ్స్ మ్యాను ఫ్యాక్టరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
వికలాంగులు, అంధులు, చెవిటి వారికి ఉచితంగా పరికరాలు అందజేస్తామని అన్నారు. కృత్రిమ అవయవాలు, సహాయపరికరాలు, క్రచ్‌లు, మూడు చక్రాల సైకిళ్లు, వీల్చైర్లు, వినికిడి పరికరాలు, బ్రెయిల్కేన్, ఎంఎస్ఈడీ కిట్లు ఎంపికైన 250 మంది వికలాంగులకు 45 రోజుల్లో అందిస్తామని అన్నారు. రిమ్స్ డెరైక్టర్ శశిధర్, లయన్స్‌క్లబ్ రీజినల్ చైర్పర్సన్ వెంకటేశ్వర్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, పోగ్రాం చైర్మన్ డాక్టర్ యండి.సమీయొద్దీన్, సభ్యులు పాల్గొన్నారు.